కొణిజర్ల, ఆగస్టు 26 : ఎలాంటి షరతులు, కొర్రీలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని కోరుతూ మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాం బాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తాళ్లపల్లి కృష్ణ కోరారు. సోమవారం సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలో ప్రచార జాతా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రులు రోజుకో ప్రకటన చేయడంతో రైతుల్లో గందరగోళం నెలకొన్నదన్నారు. తుది విడతకు గడువు ప్రకటించి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యుడు అన్నారపు వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు యాసా తిలక్, సత్యం, రామారావు, సాంబశివరావు, సాయి, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.