మధిర, జూలై 11: అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలంటూ మధిర తహసీల్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మందా సైదులు, పడకంటి మురళి మాట్లాడుతూ.. అనర్హులను అర్హులుగా ఎంపిక చేసిన ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇల్లు ఇప్పిస్తామని పేదలను నమ్మించి డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కనీసం ఇల్లు, సెంటు భూమిలేని పేదలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, రేకులషెడ్‌లో ఉండే పేదలకు మొదటి దఫాలో ఇళ్లు కేటాయిస్తామని కాంగ్రెస్ నాయకులు హామీలు ఇచ్చారని, కానీ ఆ హామీలను తొంగలో తొక్కి సాధారణ ప్రజలకు మొండిచేయి చూపించారని ఆరోపించారు. సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
ఇల్లు మంజూరైందని చెప్పి ఓ కాంగ్రెస్ నాయకుడు తన వద్ద రూ.10 వేలు తీసుకున్నాడని ఓ మహిళ మీడియాకు తెలిపారు. మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలో మధిర మండలం ఖమ్మంపాడు గ్రామానికి చెందిన షేక్ మీరాబీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా గ్రామంలో కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నామని తెలిపారు.
తమ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మువ్వా వెంకయ్యబాబు తన పేరున ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని చెప్పి ఆధార్‌కార్డుతోపాటు రూ.10 వేలు తీసుకున్నాడని ఆరోపించారు. మూడుసార్లు రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరైనప్పటికీ కార్డును డిలీట్ చేపిస్తున్నారని మండిపడింది. కాంగ్రెస్ పార్టీ వారికే రేషన్‌కార్డు, ఇల్లు మంజూరు చేస్తారా లేకపోతే చేయరా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు పరిశీలించి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకున్నది.
మధిర, జూలై 11: కాంగ్రెస్ ప్రభుత్వం తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని నిరసిస్తూ ఓ మహిళ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్నది. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామానికి చెందిన ఎలిజాల శిరోమణికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. దళిత కుటుంబానికి చెందిన ఆమె కడుపేద కుటుంబంలో పుట్టి కూలినాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. అర్హురాలైన తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం తన కుటుంబసభ్యులతో కలిసి దీక్ష చేపట్టింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు అవకతవకలకు పాల్పడుతూ అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రకటించిన లిస్ట్‌ను చూస్తే రెండంతస్తుల బిల్డింగ్ ఉన్నవారికి, 20ఎకరాల భూమి ఉన్నవారికి ఇళ్లు మంజూరయ్యాయని పేర్కొన్నది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రతి గ్రామంలో ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామంటే నిజమేనని నమ్మామని, కానీ మా గ్రామంలో అలా జరగలేదని వాపోయింది. నీడ లేని తమ కుటుంబానికి దయచేసి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరింది.