మధిర ఫిబ్రవరి 21: రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులకు(Chilli farmers) కింటాకు కనీస మద్దతు 25 వేల రూపాయలు చెల్లించాలని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలో రాయల వీరయ్య భవనంలో ఏర్పాటుచేసిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు ఆత్మహత్యలు ఆగాలంటే రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించినప్పుడు మాత్రమే ప్రతి రైతు సంతోషంగా ఉండి ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉంటాడన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన మిర్చి పంట మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర రూ. 25 వేలు ధర చెల్లించాలన్నారు.
గతంలో ఉన్న మిర్చి ధరల కన్నా ఈ ఏడాది మిర్చి ధరలు పూర్తిగా తగ్గడం వల్లనే రైతులు అప్పులు పాలై పెట్టిన పెట్టుబడులు కూడా రాక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు స్పందించి రైతులకి పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మధిర డివిజన్ రైతు సంఘం నాయకులు పాపినేని రామ్ నర్సయ్య, సిపిఎం మండల కార్యదర్శి రచ్చబంటి రాము, సిపిఎం మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకి రాములు, రైతు సంఘం నాయకులు తోటకూరి వెంకట నరసయ్య, ఆలస్యం రవికుమార్, కాటబత్తిన వీరబాబు, నన్నక కృష్ణమూర్తి, మద్దిని బసవయ్య, మడిపల్లి కిరణ్ బాబు, దేశబైన ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు