బోనకల్లు, సెప్టెంబర్ 20 : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో లక్ష్మీపురం నుండి గోవిందాపురం ఎల్, గార్లపాడు, రావినూతల మీదుగా బోనకల్లు తాసీల్దార్ కార్యాలయం వరకు సుమారు 15 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది. అనంతరం తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తాసీల్దార్ మద్దెల రమాదేవికి సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీకి ఉప ముఖ్యమంత్రివా లేక తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రివా? అని ప్రశ్నించారు.
కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఈ పక్షపాత వైఖరిని మానుకోకపోతే భట్టి విక్రమార్క ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. గతంలో మధిర ఎమ్మెల్యే బోడెపుడి వెంకటేశ్వరరావు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని, కానీ ప్రస్తుత ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేవలం కాంగ్రెస్ వారికి మాత్రమే పథకాలు ఇస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రజా పాలనలో తీసుకున్న దరఖాస్తులను పట్టించుకోవడం లేదని, పేదలు, వికలాంగులు, వితంతువులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు.లేకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పేదల పక్షాన నిలబడేది కేవలం సీపీఎం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేది ప్రజల సొమ్ము అని, అది కాంగ్రెస్ నాయకుల సొత్తు కాదని గుర్తు చేశారు. ధనికులకు, కాంగ్రెస్ వారికి మాత్రమే ఇళ్లు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాల్ రావు, సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెరువు కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు, మండల నాయకులు తుళ్లూరు రమేష్, గుడ్డురి ఉమ, జొన్నలగడ్డ సునీత, చిట్టుమోదు నాగేశ్వరరావు, గుగులోత్ నరేష్, తెల్లాకుల శ్రీనివాసరావు, మాదినేని వీరభద్రరావు, జోనిబోయిన గురవయ్య, ఎర్రగాని నాగరాజు, కందికొండ శ్రీనివాసరావు, బంధం శ్రీనివాసరావు, మర్రి తిరుపతిరావు, గ్రామాల నుంచి సిపిఎం శాఖా కార్యదర్శులు, ప్రజా సంఘాల నాయకులు, పార్టీ సభ్యులు, సానుభూతిపరులు పాల్గొన్నారు.
Bonakal : డిప్యూటీ సీఎం రాష్ట్రానికా లేక కాంగ్రెస్‌కా?.. భట్టి విక్రమార్కపై సీపీఎం విమర్శ