ఖమ్మం/ ఖమ్మం కమాన్‌బజార్, ఆగస్టు 8: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు అధికారం చేపట్టి ఇన్ని నెలలు గడుస్తున్నా ఆ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణాలకు రూ.10 లక్షలు అందించాలని, సామాజిక పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీని అమలుచేయాలని, పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలని, ఆయా భూములపై హకులు కల్పించాలని, రైతుభరోసా అందించాలని, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల జీవనభృతి అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. తొలుత కలెక్టరేట్ నుంచి వీవీపాలెం సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్‌కు వినతిపత్రాన్ని అందించారు. పార్టీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, పుల్లయ్య, రామయ్య, అర్జున్ రావు, ఆవుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.