అశ్వారావుపేట/ జూలూరుపాడు, మే 29 : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో అశ్వారావుపేట, జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మాస్‌లైన్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గోకినపల్లి ప్రభాకర్, జూలూరుపాడు మండల కార్యదర్శి బానోతు ధర్మా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలపై మోయలేని ఆర్థిక భారం వేస్తున్నారని, సామాన్యులపై పన్నులు, ధరల భారం మోపి కార్పొరేట్ సంస్థలు లాభాలు గడించేలా చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు తగ్గించని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్లు శ్రీనివాస్, కిశోర్‌కు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు కంగాల కల్లయ్య, వాసం బుచ్చిరాజు, గొంది లక్ష్మణరావు, గంగ, పోతురాజు, వెంకటేషు, రంగారావు, పోలరాజు, రాయల సిద్దు, లింగాల వీరభద్రం, కుంచపు జమలయ్య, బోడా సుందర్, పైదా వెంకటేశ్వర్లు, బానోతు హన్మంతరావు, బానోతు ఈరు, జి.కృష్ణ, కల్తీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం గణేష్టెంపుల్, మే 29 : కేంద్ర ప్రభుత్వం వరుసగా పెంచుకుంటూ పోతున్న ఇంధన ధరలు వెంటనే తగ్గించాలని ఆటో వర్కర్స్ యూనియర్ రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల జమలయ్య డిమాండ్ చేశారు. పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు కొత్తగూడెం పట్టణంలో శుక్రవారం ఆటోకు తాడుకట్టి లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం ఉపాధి కోసం ఆటోలు నడుపుకుంటూ జీవిస్తున్న ఆటో కార్మికులపై ఇంధన ధరలు పెంచుతూ మోదీ ప్రభుత్వం మోయలేని భారం మోపుతుందన్నారు.
కార్పొరేట్ శక్తలకు ఊడిగం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం పేదలను ఇబ్బందులకు గురి చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఇంధన ధరలపై యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ, శ్రీను, జానీ, అబ్బులు, సంపత్, లక్షణ్ తదితరులు పాల్గొన్నారు.