ఖమ్మం, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నోటిఫికేషన్ వెలువడడం, పరీక్ష రాయడం, ఫలితాలు రావడం, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తికావడం, 1:1 నిష్పత్తిలో జాబితా వెలువడడం.. వెరసి తాజాగా పోస్టింగ్‌ల ఉత్తర్వులు అందుకోవడం. ఇదీ.. డీఎస్సీ-2024 అభ్యర్థులు ‘కొలువు’దీరిన ప్రక్రియ. తాజా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియ సందిగ్ధం మధ్య కొనసాగింది. ఎట్టకేలకు ఆయా అభ్యర్థులు మంగళవారం పోస్టింగ్‌ల ఉత్తర్వులు అందుకున్నారు.
ఖమ్మంలోని డైట్ కళాశాలలో 520 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, ఇతర కేటగిరీల్లో ఆయా అధికారులు మంగళవారం నియామక పత్రాలను అందజేశారు. తొలుత ఉపాధ్యాయులు ఉదయం 10 గంటలకే చేరుకున్నప్పటికీ.. కౌన్సెలింగ్ వాయిదా పడిందంటూ అధికారులు ప్రకటించడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు మళ్లీ మధ్యాహ్నం సమాచారం ఇచ్చారు. దీంతో మరోసారి వారంతా చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రారంభమైన కౌన్సెలింగ్.. అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగింది.
సందిగ్ధం నడుమ..
డీఎస్సీ-2024లో ప్రతిభ కనబర్చి కొలువులు సాధించి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయులు.. పోస్టింగ్‌లు పొందేందుకు ఎంతో ఆతృతగా, ఆనందంగా మంగళవారం ఉదయం 9 గంటలకే ఖమ్మంలోని డైట్ కళాశాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయ కొలువులో చేరేందుకు సమయం ఆసన్నమైందనుకున్న సమయంలో ఒక్కసారిగా వారి ఆశలపై నీళ్లు చల్లినట్లుగా ఓ ప్రకటన వచ్చింది.
కౌన్సెలింగ్ వాయిదా పడిందని, మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయంపై తర్వాత సమాచారం ఇస్తామని ఉదయం 10 గంటలకు అధికారులు పేర్కొన్నారు. దీంతో చివరి నిమిషంలో ఇలా జరిగిందేంటనుకుంటూ అభ్యర్థులు ఆందోళనతో వెనుదిరిగారు. అధికారులు కూడా ఉన్నతాధికారుల ఆదేశాలతో కొంత గందరగోళంలో పడ్డారు. ఏం జరుగుతుందో తెలియక దూరప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు అసహనంతో వెనుదిరిగారు.
మళ్లీ మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చింది. దీంతో కౌన్సెలింగ్ ఉంటుందని, అభ్యర్థులు హాజరుకావాలని డీఈవో సోమశేఖర శర్మ ప్రకటించారు. అయితే, అభ్యర్థులు వెళ్లిపోయారని, బుధవారం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారమే ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉందని స్పష్టం చేయడంతో అభ్యర్థులు సాయంత్రం వరకు కౌన్సెలింగ్ ప్రదేశానికి వస్తూనే ఉన్నారు.
అర్ధరాత్రి వరకూ ప్రక్రియ..
ప్రభుత్వ, పరిషత్ స్కూళ్లకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు ప్రత్యేకంగా త్వరితగతిన ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాటు చేశారు. అనుభవం కలిగిన సీనియర్ హెచ్ఎంలు, కంప్యూటర్ నైపుణ్యం కలిగిన డీఈవో కార్యాలయ సిబ్బంది, ఎంఈవోల ఆధ్వర్యంలో తొలుత అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. డీఎస్సీకి ఎంపికైన ఉత్తర్వుల కాపీ, కౌన్సెలింగ్‌లో ఆప్షన్ పేపర్, నాలుగు ఫొటోలను తీసుకుని సబ్జెక్టుల వారీగా నియామక ఉత్తర్వులు అందజేశారు.
కార్యాలయ సూపరింటెండెంట్లు చావా శ్రీను, శ్రీధర్‌బాబు పర్యవేక్షణలో డీఈవో కార్యాలయ సిబ్బంది, డైట్ సిబ్బంది కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థులకు సూచనలు చేస్తూ ప్రక్రియను సమన్వయం చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు నియామక ఉత్తర్వులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం కాగా.. అర్ధరాత్రి 12 గంటల వరకూ అది కొనసాగింది. ఉపాధ్యాయ సంఘాలు తోడ్పాటునందించాయి. కాగా.. ఏళ్ల కల నిజమవడంతో పోస్టింగ్ ఉత్తర్వులు అందుకున్న టీచర్లలో కొత్త ఉత్సాహం ఉరకలేసింది.
రిపోర్ట్ చేసేందుకు 15 రోజుల గడువు..
డీఎస్సీ-2024 పోస్టింగ్ ఉత్తర్వులు అందుకున్న టీచర్లు ఆయా పాఠశాలల్లో రిపోర్ట్ చేసేందుకు విద్యాశాఖ 15 రోజుల గడువు ఇచ్చింది. నియామకపత్రాలు అందుకున్న టీచర్లకు సంక్రాంతి సెలవుల్లో ఎస్సీఈఆర్టీ అధ్యాపకుల నేతృత్వంలో శిక్షణ ఉండొచ్చని డీఈవో సోమశేఖర శర్మ పేర్కొన్నారు. కాగా.. గతంలో శిక్షణ ఇప్పించి పోస్టింగ్‌లు ఇచ్చి స్కూళ్లకు పంపేవారు.
భద్రాద్రి జిల్లాలో…
కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 15 : డీఎస్సీ-2024లో ఎంపికైన అభ్యర్థులకు ఉపాధ్యాయులుగా నియామక పత్రాలను డీఈవో వెంకటేశ్వరాచారి మంగళవారం సాయంత్రం అందజేశారు. పాత కొత్తగూడెంలోని ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌కు వచ్చిన అభ్యర్థులకు కొన్ని అనివార్య కారణాల వల్ల కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు అధికారులు తొలుత ప్రకటించారు. దీంతో ఉదయం వచ్చిన అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. మళ్లీ అధికారులు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పడంతో అభ్యర్థులు ఉరుకులు పరుగులతో పాఠశాల వద్దకు చేరుకున్నారు. కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థుల మెరిట్ ఆధారంగా వారికి పాఠశాలలను కేటాయిస్తూ నియామక పత్రాలను డీఈవో అందజేశారు.
తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహంతో..
ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూనే కష్టపడి చదివి టెట్‌లో ఫస్ట్ ర్యాంక్, డీఎస్సీలో జిల్లా రెండో ర్యాంక్ సాధించాను. తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహంతోనే టీచర్ కొలువు తెచ్చుకోగలిగాను. ఖమ్మంలోని ఎన్ఎస్సీ కాలనీ పాఠశాలలో ఎస్జీటీగా నియామక పత్రం తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మంచి ఉపాధ్యాయురాలిగా రాణిస్తా. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతా.
-వలసాల ఉమ, ఎస్జీటీ
తెలంగాణ నాకు మరో జీవితాన్నిస్తోంది..
నాది రాజమండ్రి. డీఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో నాన్ లోకల్ కోటాలో నాకు ఉద్యోగం వచ్చింది. చాలా ఆతృతతో నిన్న రాత్రి ఖమ్మం చేరుకున్నా. ఉద్యోగం సాధించడంతో చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం నాకు మరో జీవితాన్ని ఇస్తోంది. ఇక్కడే స్ధిరపడతాం.
-మణికుమారి, ఎస్ఏ హిందీ, రాజమండ్రి
నాన్న, మామయ్య స్ఫూర్తితోనే..
మా నాన్న హెచ్ఎం, మా మామయ్య రిటైర్డు హెచ్ఎం. నా చిన్నతనం నుంచి వారిని చూస్తూ పెరిగాను. వారి మాదిరిగానే టీచర్ కావాలనే కోరిక ఉండేది. డిగ్రీ ఫైనలియర్‌లోనే పెళ్లి అయ్యింది. నా భర్త నా లక్ష్య సాధనకు బాటలు వేస్తూ.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత డీఈడీ చదివించారు. రెండుసార్లు టెట్ క్వాలిఫై అయ్యి డీఎస్సీ కోసం ఎదురు చూస్తుండగా ఇటీవల నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం సాధించాను. పోస్టింగ్ ఆర్డర్ తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.
-దూళ్ల సౌజన్య, సత్తుపల్లి