ఖమ్మం ఎడ్యుకేషన్, అక్టోబర్ 14 : ఖమ్మం జిల్లాలో డీఎస్సీ 2024 ద్వారా ఎంపికైన 520 మంది టీచర్లకు పోస్టింగ్‌లు ఇచ్చే ప్రక్రియ మంగళవారం జరుగనున్నది. అయితే అభ్యర్థులకు నిర్వహించే కౌన్సిలింగ్లో పాత విధానాన్ని అమలుపరుస్తున్నారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా తీసుకొచ్చిన ‘వెబ్ కౌన్సిలింగ్’ విధానాన్ని పక్కనబెట్టి, గతంలో ఎన్నోసార్లు గందరగోళంగా మారిన పాత ప్రక్రియను తీసుకొచ్చారు. గత ప్రభుత్వం వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియను ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా వెబ్ కౌన్సిలింగ్ పద్ధతిలోనే పూర్తిచేసింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మాత్రం వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని పక్కనబెట్టి పాత పద్ధతిలో కౌన్సిలింగ్ చేసేందుకు సిద్ధమవ్వడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది.
ప్రభుత్వం నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల బదిలీల ప్రక్రియలో బదిలీ అయినప్పటికీ రిలీవ్ కాని ఉపాధ్యాయులు మంగళవారం రిలీవ్ కావాలని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. వీరితోపాటు డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న ఉపాధ్యాయుల స్థానంలో నూతన ఉపాధ్యాయులు నియమితులైతే డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న టీచర్ల డిప్యూటేషన్ రద్దు కానుంది. కౌన్సిలింగ్లో పోస్టింగ్ అందుకున్న ఉపాధ్యాయులు ఈ నెల 16వ తేదీ నుంచి పాఠశాలల్లో రిపోర్ట్ చేసేలా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయనున్నది.
నూతన టీచర్లకు పోస్టింగ్‌లు కల్పించే కౌన్సిలింగ్ ప్రక్రియకు జిల్లాలోని 21మంది ఎంఈవోలకు బాధ్యతలు అప్పగించారు. డీఈవో కార్యాలయంలోని సూపరింటెండెంట్స్ నుంచి అటెండర్ల వరకు పూర్తిస్థాయిలో సిబ్బందిని మంగళవారం డైట్ కళాశాలలో నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియ వద్ద విధులు నిర్వహించేలా నియమించారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు నాలుగు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో రావాలని డీఈవో సూచించారు.
డీఎస్సీ 2024 ఉపాధ్యాయులకు సంబంధించి పోస్టింగ్స్ ఇచ్చేందుకు ముందుగా 1:1 నిష్పత్తిలో ఖాళీల జాబితాను ప్రదర్శించనున్నారు. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలు ఇలా అన్ని విభాగాల్లో 1:1 నిష్పత్తిలో జాబితాను ప్రకటించనున్నారు. దీనిలో కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేని మారుమూల ప్రాంతాల్లోని స్కూల్స్‌కి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఎర్రుపాలెం, వేంసూరు, కారేపల్లి, మధిర వంటి మండలాల్లోని స్కూల్స్‌ని జాబితాలో చేర్చారు. 520మంది అభ్యర్థులకు 520 ఖాళీల జాబితాను విద్యాశాఖాధికారులు సిద్ధం చేశారు. డైట్లో కౌన్సిలింగ్ నిర్వహణకు అవసరమైన కంప్యూటర్లు, కౌన్సిలింగ్ అనంతరం వెంటనే పోస్టింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 14 : డీఎస్సీ-2024లో ఎంపికై డీఈవో కార్యాలయంలో రిపోర్టు చేసిన అభ్యర్థులకు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వరాచారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాత కొత్తగూడెంలోని ఇంగ్లిష్ మీడియం స్కూల్లో వీరికి కౌన్సిలింగ్ నిర్వహించి, పాఠశాలలను కేటాయిస్తామని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు తమ నియామక పత్రాలతో హాజరుకావాలని ఆయన కోరారు.