ఖమ్మం వ్యవసాయం, మార్చి 22: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌టైం రికార్డు ధరను అందిస్తోంది. రైతుల దగ్గర పంట ఖాళీ అవుతున్న నేపథ్యంలో పత్తికి జాతీయ మార్కెట్లో మరింత డిమాండ్ పెరుగుతోం ది. దీంతో పంటను ఇంతకాలం నిల్వ చేసుకొని యా ర్డుకు తీసుకొస్తున్న రైతుల సంతోషానికి అవధులు లేకుం డా పోతున్నాయి. షేర్మార్కెట్లో సెన్సెక్స్ తరహాలో తెల్లబంగారం ధరలు అప్పర్ సర్క్యూట్లు కొడుతున్నాయి. ఈ రోజు ధరకు రేపటి ధరకు సంబంధం లేకుండా పో తోంది. తాజాగా, మంగళవారం ఉదయం పత్తి యా ర్డుకు ఆయా జిల్లాల నుంచి రైతులు సుమారు 1100 పత్తి బస్తాలను యార్డుకు తీసుకొచ్చారు. జాతీయ మా ర్కెట్లో తెలంగాణ పత్తి పంటకు రికార్డు స్థాయి ధరలు పలుకుతుండడం, అంతర్జాతీయ మార్కెట్ వ్యాపారులు సైతం పోటీపడుతుండటం వంటి కారణాలతో ఆన్లైన్ బిడ్డింగ్‌లో పంటను సొంతం చేసుకునేందుకు వ్యాపారులు క్యూ కడుతున్నారు. ఉదయం జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో రికార్డుస్థాయిలో క్వింటా రూ.10,850 పలికి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక్క రోజు వ్యవధిలోనే క్వింటాకు రూ.250 పెరిగింది. ఒకవైపు పత్తి ధరలు, మరోవైపు మిర్చి ధరలు పెరుగుతుండడంతో మార్కెట్లో క్రయవిక్రయాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, సెక్రటరీ మల్లేశం కలిసి పర్యవేక్షించారు. పత్తి పంటకు రాష్ట్రంలోకెల్లా ఖమ్మం మార్కెట్లో మరోసారి మంచి ధర రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.