ఊట్కూర్, అక్టోబర్ 27 : పత్తి రైతు కుదేలవుతున్నాడు. వరుసగా కురుస్తున్న వర్షాలు కోలుకోకుండా చేస్తున్నాయి. అధిక వర్షాలతో పంట చేతికొచ్చే సమయంలో కళ్లెదుటే పూత రాలిపోతున్నది. రంగు మారి, కాయ మురిగి పోతుండడంతో అన్నదాతలు కన్నీరు పెడ్తున్నారు.పైర్లు సైతం ఎర్రబడగా.. వర్షాలు ఇలాగే పడితే కనీసం పెట్టుబడి ఖర్చులు సైతం రావని రైతులు దిగాలు చెందుతున్నారు. నారాయణపేట జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో తెల్లబంగారాన్ని సాగు చేశారు. అయితే ప్రకృతి సహకరించకపోగా.. పెట్టుబడి పెరిగి.. దిగుబడి తగ్గి రైతులకు తీవ్రనష్టం మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఏడాది ఎకరాకు 10 క్వింటాళ్లు పండగా.. ఈ ఏడాది కేవలం 2 నుంచి 4 క్వింటాళ్లలోపే దిగుబడి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని ఎదురుచూస్తున్నారు.
వానకాలం సీజన్లో కురుస్తున్న వర్షాలతో పత్తి దె బ్బతిన్నది. నారాయణపేట జిల్లాలో నల్లరేగడి నేల లు తెల్లబంగారం సాగుకు అనుకూలం కావడంతో అధిక మొత్తంలో రైతులు పంటను సాగు చేశారు. గతేడాది 1.50 లక్షల ఎకరాల్లో పంటను వేయగా.. ఈ ఏడాది ఏకంగా 1.63 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షా లు పత్తి రైతును చిత్తు చేశాయి. పేట జిల్లాలో అత్యధికంగా ఊట్కూర్ మండలంలో రైతులు 42 వేల ఎకరాల్లో కాటన్ సాగు చేయగా.. మక్తల్ మం డలంలో 26 వేల ఎకరాలు, కృష్ణ మండలంలో 19,500 ఎకరాలు, నారాయణపేట మండలంలో 15 వేల ఎకరాలు, మరికల్ మండలంలో 14, 500 ఎకరాలు, మాగనూర్ మండలంలో 13, 500 ఎకరాలు, నర్వ మండలంలో 13,200 ఎకరాలు, ధన్వాడ మండలంలో 7,680 ఎకరాలు, దామరగిద్ద మండలంలో 4,632 ఎకరాలు, మద్దూర్ మండలంలో 3, 200 ఎకరాలు, కోస్గి మ ండలంలో 2,300 ఎకరాలు, గుండుమాల్ మం డలంలో 950 ఎకరాలు, కొత్తపల్లి మండలంలో 620 ఎకరాల్లో పంటను రైతులు పండించారు.
జిల్లాలో కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలతో పలు మండలాల్లోని పంట పొలాల్లోకి వరద చేరింది. అధిక వర్షాలతో పత్తి పంటలకు పూత, పిందె రాలిపోయి దిగుబడు లు పూర్తిగా దెబ్బతిన్నా యి. గతేడాది ఎకరాకు 10 క్వింటాళ్లు పండగా.. ఈ ఏడాది కేవలం 2 నుంచి 4 క్వింటాళ్లలోపే దిగుబడి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత జూన్ నెలలో 52.06 మి.మీ., జూలైలో 198. 02 మి.మీ., ఆగస్టులో 342.05 మి.మీ., సెప్టెంబర్లో 190.07 మి.మీ., అక్టోబర్లో 20.08 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో చేతికొచ్చిన పంట నల్లబారి నేలరాలింది. వ్యాపారులు తేమ శాతం మేరకు ధరలను నిర్ణయిస్తున్నారు. దీంతో మార్కెట్లో గరిష్ఠ ధర రూ.7,100, కనిష్ఠంగారూ.5 వేల ధర పలికింది.
ఎకరాకు రూ.20 వేలకుపైగానే పంట పెట్టుబడి పెట్టిన రైతులను ఓ పక్క తగ్గిన పంట దిగుబడులు, మరో పక్క అరకొర ధరలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ఏడాది పూర్తి స్థాయిలో పత్తి పంటలు దెబ్బతినడంతో ప్రభుత్వం తక్షణమే స్పందిం చి పత్తికి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సీసీఐ ద్వారా ఏర్పాటు చేస్తు న్న కాటన్ కొనుగోలు కేంద్రాలను ఎల్-1, ఎల్-2, ఎల్-3 పద్ధతిలో కాకుండా జిల్లాలోని అన్ని కాటన్ ఇండస్ట్రీల వద్ద ఒకే సారి కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆలస్యం కావడంతో పండిన కొద్దిపాటి పత్తిని తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు.
ఆరెకరాల్లో నేను పత్తి పంటను సాగు చేశాను. మొదటి విడుతలో పత్తి 10 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ఇంకోసారి తీయిస్తే 10 క్వింటాళ్లు వస్తుందో? లేదో తెలియదు? పంటకు రూ.2 లక్షలకుపైగానే పెట్టుబడి పెట్టాను. వర్షాలు పూర్తిగా పంటలను దెబ్బతీశాయి. మార్కెట్లో గతేడాదితో పోలిస్తే ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం మద్దతు ధరలను చెల్లించి కొనుగోలు చేయాలి. అలాగే పంట పరిహారం అందించి ఆదుకోవాలి.
– తిమ్మప్ప, పత్తి రైతు, నిడుగుర్తి, నారాయణపేట జిల్లా
వర్షాలకు పత్తి పంటలు పాడై దిగుబడి తగ్గిపోవడంతో వ్యాపారం మందకొ డిగా ఉన్నది. రోజుకు 500 నుంచి 600 క్వింటాళ్లు మాత్రమే అమ్మకానికి వస్తుంది. గతేడాది 60 వేల క్వింటాళ్ల తెల్లబంగారాన్ని కొనుగోలు చేశాం. వర్షాలతో పంటలు దెబ్బతినడంతో ఈ ఏడాది కొనుగోళ్లు సగానికి తగ్గే అవకాశం ఉన్నది. రైతులు పత్తికి నాణ్యత ప్రమాణాలు పాటిస్తే మంచి ధర పలుకుతున్నది. వర్షానికి తడిసిన కాటన్ను నేరుగా తీసుకురావద్దు. ఆరబెట్టిన పత్తి 08 నుంచి 09 శాతంలోపు తేమతో నాణ్యతగా ఉంటే మంచి ధరతో కొనుగోలు చేస్తాం.
– కిషోర్ జైన్, విజయ కాటన్ ఇండస్ట్రీ యజమాని, ఊట్కూర్