రఘునాథపాలెం, నవంబర్ 20 : ఆరుగాలం కష్టపడి పంట పండించి విక్రయానికి మార్కెట్కు తరలించిన రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. అకాల వర్షాలు, తపాన్లు, తెగుళ్ల బారి నుంచి ఎంతో కొంత చేతికొచ్చిన పంటను విక్రయానికి తీసుకొస్తే అందిన కాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వ్యాపారుల చేతిలో దివ్యశక్తులు ఉన్నట్లు పత్తిలోని తేమ శాతాన్ని చేతి స్పర్శతోనే చెప్పేస్తూ నోటికొచ్చిన ధరను నిర్ణయిస్తున్నారు. వీరికి మార్కెట్ అధికారులు సైతం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏటా జరుగుతున్న నిలువు దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మద్దతు ధరతో సంబంధం లేకుండా వ్యాపారులు రైతులను నిండా ముంచుతున్నారు. మార్కెట్లో వ్యాపారుల తీరుపై అన్నదాతలే విసుగెత్తిపోతున్నారంటే వారి దందా ఏ స్థాయిలో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. తేమ సాకుతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో సంబంధం లేకుండా కొనుగోళ్లు చేపడుతూ రైతులను నిలువునా ముంచుతున్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారం నిర్వహించేందుకు వందల సంఖ్యలో వ్యాపారులు లైసెన్స్లే కలిగి ఉన్నారు. లైసెన్స్ ఉన్న ప్రతి వ్యాపారి జెండాపాట సమయానికి తప్పక హాజరుకావాలి. కానీ, ప్రతిరోజు జరిగే జెండాపాటకు కేవలం 5 నుంచి 10 మందిలోపు వ్యాపారులు మాత్రమే వస్తుండడం విశేషం. రైతులు మార్కెట్కు పత్తి పంటను విక్రయానికి తీసుకురాగానే వ్యాపారులు, మార్కెట్ కమిటీ అధికారుల సమక్షంలో జెండాపాట నిర్వహిస్తారు. ఈ క్రమంలో వ్యాపారులంతా సిండికేట్ అయి మద్దతు ధర కంటే తక్కువగా జెండాపాట నిర్వహిస్తారు. ప్రభుత్వం పత్తికి మద్దతు ధర ప్రకటించిన ప్రకారం రూ.8,110 ఉండగా.. మార్కెట్లో మాత్రం రూ.7 వేలకు మించి జెండాపాట దాటడం లేదు. జెండాపాటకు వ్యాపారులు హాజరైతే ధర పెరిగే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు. మార్కెట్ పాలకవర్గం, అధికారులు.. జెండాపాటకు హాజరుకావాలనే ఆదేశాలను వ్యాపారులకు జారీ చేసింది లేదు. దీంతో మార్కెట్లో వ్యాపారుల ఆగడాలకు అంతూపంతూ లేకుండా పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మార్కెట్లో జెండాపాటనూ వ్యాపారులు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోరు. ఉదాహరణకు.. రూ.7 వేలకు జెండాపాట పలికితే.. వ్యాపారుల వద్ద మాత్రం తేమ శాతం పేరుతో రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తారు. దీంతో చాలా మంది రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు అండగా నిలవాల్సిన మార్కెటింగ్ అధికారులు తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరించడం ఇక్కడ నిత్యకృత్యమైంది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు చెప్పిందే ధర. పత్తిని చేతితో పట్టుకొని ధర చెప్పేస్తున్నారు. బాగున్న పత్తిని కూడా అయినకాడికి తగ్గించి కొంటున్నారు. మార్కెట్లో తేమ శాతం యంత్రాలు లేకపోవడంతో వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాల కారణంగా దిగుబడి పూర్తిగా తగ్గింది. తీరా చేతికొచ్చిన కొద్ది పత్తిని మార్కెట్కు తీసుకొస్తే వ్యాపారులు మా కాష్టాన్ని దోచుకుంటున్నారు.
-వీరబోయిన నాగయ్య, రైతు, సర్వారం, మోతె, సూర్యాపేట