ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 22: కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే ఏదో జరుగుతుందనుకొని అనుకున్నామని, తీరా ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మోసపోయి గోస పడుతున్నామని పత్తి రైతులు, ఖమ్మం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మం ఏఎంసీకి శుక్రవారం వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు ఎదుట రైతులు తమ బాధను వెళ్లబోసుకున్నారు.
‘ఈ వానకాలం సీజన్లో ఏ పంటలు సాగు చేశారు? దిగుబడులు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ సాయం అందిందా? రైతుబంధు, రైతుబీమా అమలవుతున్నాయా? కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎంతవరకు వచ్చాయి? ప్రస్తుతం మార్కెట్లో పత్తి పంటకు ఏ ధర పలుకుతోంది? మద్దతు ధర లభిస్తుందా?’ అంటూ రైతులను హరీశ్‌రావు ఆరా తీశారు.
ఇందుకు అన్నదాతలు స్పందిస్తూ.. కేసీఆర్ ఇచ్చే సాయం కంటే డబుల్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పడంతో తాము మోసపోయామని రైతులు వాపోయారు. ఇటీవల వరదలకు నష్టపోయిన సారధినగర్, దానవాయిగూడెం వాసులు సైతం బీఆర్ఎస్ నాయకులను కలిసి తమకు నేటివరకు వరద సాయం అందలేదని వాపోయారు. మార్కెట్లో రెల్లుడు మహిళా కార్మికులు సైతం హరీశ్‌రావుకు తమ బాధలు చెప్పుకున్నారు. తులం బంగారం, మహాలక్ష్మి పేరుతో రూ.2,500 ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు అందడం లేదని వాపోయారు. అయితే, రైతులు, కార్మికుల బాధలు ఓర్పుగా విన్న హరీశ్.. వాటిని నోట్ చేసుకున్నారు.