పత్తి రైతులు సమిధలవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీసీఐ కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు కలిసి వారికి నరకం చూపిస్తున్నాయి. నిబంధనల మధ్య పెట్టి నలిపేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో దూదిపూల రైతులకు దుఃఖాన్ని తెప్పిస్తున్నాయి. కపాస్ కిసాన్ యాప్, తేమ శాతం, ఏడు క్వింటాళ్ల నిబంధనల పేరిట ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వాలు.. తాజాగా సోమవారం మరోసారి చుక్కలు చూపించాయి. తమ సమస్యల పరిష్కారం జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం నుంచి మిల్లులను మూసివేసి బంద్ పాటిస్తున్నారు. దీంతో, జిన్నింగ్ మిల్లుల్లో కొనసాగుతున్న భారత పత్తి సంస్థ (సీసీఐ)కు చెందిన పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా తెరుచుకోలేదు.
బంద్ కారణంగా సీసీఐ కేంద్రాలు కూడా పనిచేయబోవని అధికారులు ప్రకటనలు కూడా జారీ చేయలేదు. రైతులకు సమాచారాన్నీ చేరవేయలేదు. పైగా, పత్తి పంటను విక్రయించుకునేందుకు కపాస్ కిసాన్ యాప్‌ను కూడా ఆఫ్ చేయలేదు. దీంతో జిల్లాలోని చాలామంది రైతులు తమ పంటను సోమవారం విక్రయించుకునేందుకు యాప్‌లో నమోదు చేసుకోగా.. స్లాట్లు బుక్ అయ్యాయి. దీంతో రైతులు వ్యయప్రయాసలకు ఓర్చి, వాహనాలు కిరాయికి తీసుకొని, వాటిల్లో పత్తిని నింపుకొని ఉదయమే సీసీఐ కేంద్రాలకు చేరుకున్నారు. తీరా అక్కడికొచ్చాక కొనుగోలు చేయట్లేదని తేలడంతో పత్తి రైతులు ఆగ్రహించారు. ఖమ్మం కోదాడ ప్రధాన రహదారిపై పత్తి లోడు వాహనాలను అడ్డుపెట్టి రాస్తారోకో చేశారు.
-ఖమ్మం రూరల్, నవంబర్ 17
కొత్త కొత్త నిబంధనల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులకు అవస్థలు పెడుతున్నాయి. దీంతో నెల రోజులుగా జిల్లా రైతులు నరకం చూపిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. అన్నింటినీ తట్టుకొని కొద్దోగొప్పో చేతికొచ్చిన పంటకు ఆశించిన ధర లేకుండా పోయింది. దీనికితోడు కిసాన్ యాప్ పేరుతో సీసీఐ పెట్టిన నిబంధనలు నరకం చూపిస్తున్నాయి. వాటినీ అధిగమిస్తే తేమ శాతం పేరుతో తిప్పలు పెడుతున్నాయి. దానిని దాటుకొని పత్తిని ఆరబెట్టుకొని తీసుకొస్తే ఎకరానికి ఏడు క్వింటాళ్లే కొంటామంటూ కొర్రీలు పెడుతున్నాయి. వాటినీ అధిగమించి కిరాయిలు భరించి వాహనాల్లో పత్తిని తీసుకొస్తే సీసీఐ కేంద్రాలకు తాళాలు వేసి ఉన్నాయి. దీంతో కర్షకుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
ప్రభుత్వాల తీరుతో పత్తి రైతులు ఇప్పటికే అరిగోస పడుతున్న వేళ జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం నుంచి బంద్‌కు దిగారు. దీంతో ఆయా మిల్లుల్లోని సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. తమకిచ్చిన హామీలను ప్రభుత్వాలు నెరవేర్చడం లేదని, సీసీఐ షరతులతో తాము నష్టపోతున్నామని, తమ సమస్యలను పరిష్కరించే వరకూ బంద్ పాటిస్తామని చెబుతూ జిన్నింగ్ మిల్లుల యజమానులు రాష్ట్ర వ్యాప్తంగా తమ మిల్లులను మూసివేశారు. దీంతో ఖమ్మం జిల్లాలోని జిన్నింగ్ మిల్లులు కూడా మూతపడ్డాయి. ఫలితంగా వాటిల్లోని సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. అయితే, సీసీఐ అధికారులు ముందస్తుగా స్పందించి యాప్‌ను ఆఫ్ చేసి ఉంటే రైతులకు స్లాట్లు బుక్ అయ్యేవి కావు. అధికారులు యాప్‌ను ఆన్‌లోనే ఉంచడంతో రైతులు సోమవారం నాటికి స్లాట్లు బుక్ చేసుకున్నారు.
ఖమ్మం రూరల్, ఏదులాపురంలలో మూడు కొనుగోలు కేంద్రాలకు రోజూ మాదిరిగానే దూర ప్రాంతాల నుంచి పంటను తీసుకొచ్చారు. ట్రాక్టర్లు, ట్రాలీలను కిరాయికి తీసుకొని లూజు పత్తి తీసుకొచ్చారు. అయితే ఎంతసేపటికీ కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు కిరాయికి వచ్చిన వాహనాల యజమానులు ఆలస్యమవుతుందంటూ ఒత్తిడి తేవడంతో వారికి సమాధానం చెప్పలేక అవస్థలు పడ్డారు. అప్పటికీ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఖమ్మం కోదాడ ప్రధాన రహదారిపై వెంకటగిరి క్రాస్‌రోడ్డు వద్ద పత్తిపంట వాహనాలను రోడ్డుపై నిలిపి కొద్దిసేపు రాస్తారోకో చేశారు. అనంతరం, కొందరు రైతులు వ్యయప్రయాసలకోర్చి నిరాశతో తిరిగి పంటను తీసుకెళ్లిపోయారు. మరికొందరు రైతులు గత్యంతరంలేని పరిస్థితుల్లో వాహనాల అద్దె భరించేందుకు సిద్ధమై జిన్నింగ్ మిల్లు ఆవరణలోనే వాహనాలను ఉంచి వెళ్లిపోయారు.

ఖమ్మం పత్తి మార్కెట్లో నేడు ఆందోళన: బీఆర్ఎస్
ఖమ్మం, నవంబర్ 17: పత్తి రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివక్షను నిరసిస్తూ ఖమ్మం ఏఎంసీ పత్తి యార్డులో మంగళవారం ఆందోళన నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం ఉదయం ఖమ్మం పత్తి మార్కెట్లో నిర్వహించనున్న ధర్నాను రైతులు జయప్రదం చేయాలని కోరారు.
స్లాట్ బుక్ అయితేనే పంటను తెచ్చా..
ఈ రోజు (సోమవారం) ఉదయం పత్తిపంటను సీసీఐ కేంద్రంలో అమ్ముకోవాలని యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్నారు. స్లాట్ సక్సెస్ కావడంతో పంటను తీసుకొని పొన్నెకల్ జిన్నింగ్ మిల్లుకు వచ్చాను. గంటలు గడుస్తున్నా ఎవరూ రాలేదు. మిల్లు సిబ్బందిని అడిగితే సీసీఐ బంద్ అని చెప్పారు. ట్రాక్టర్‌కు రూ.4 వేలు పెట్టి కిరాయికి తీసుకొచ్చాను. లోడ్ చేసిన కూలీలకు మరో రూ.3 వేలు అయ్యాయి. తీరా ఇక్కడికొస్తే బంద్ అన్నారు. పొలం కౌలుకు తీసుకొని పుట్టెడు కష్టంచేసి ఇబ్బందులకోర్చి పత్తిని తీసుకొస్తే నరకం చూపిస్తున్నారు. ట్రాక్టర్‌కు రేపటి కిరాయినీ భరించి ఇక్కడే ఉంచుతున్నాను.
-టీ.వేణుప్రసాద్, రైతు, నేలకొండపల్లి
తీరా వచ్చాక.. కొనట్లేదంటున్నారు..
సీసీఐ వాళ్లు పంటను కొనకపోతే ముందుగానే గ్రామాల్లో చెప్పాలి. కానీ మేం తీరా పంటను తీసుకొని ఇక్కడికి వచ్చాక కొనడంలేదని ఇబ్బందులు పెడితే ఎలా? ట్రాలీ కిరాయికి తీసుకొని వచ్చాను. తిరిగి తీసుకెళ్తే ఖర్చులెలా భరించాలి? పదెకరాలు కౌలుకు తీసుకొని పత్తిని సాగు చేస్తే కనీసం సాగు ఖర్చులు కూడా పూడేటట్టు లేదు. ఇప్పటికే వర్షాలకు పంటలు నష్టపోయాం. ఇప్పుడు కొర్రీలు పెట్టి కొనుగోళ్లు చేయడం లేదు. మేం మరింతగా అప్పుల పాలవుతున్నాం.
-బాణోత్ సైదమ్మ, మహిళా రైతు, కొణిజర్ల