కొత్తగూడెం టౌన్, నవంబర్ 30: భద్రాద్రి జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులు కూడా బజారున పడ్డారు. తమ పత్తిని విక్రయించేందుకు సీసీఐ కేంద్రాలకు వెళ్తున్న దూదిపూల రైతులు రోజుల తరబడి రోడ్డుపై వేచి చూడాల్సి వస్తోంది. దీంతో అక్కడికి కూడా దళారులు రంగ ప్రవేశం చేసి పత్తి రైతులను దోచుకుంటున్న తీరు కన్పిస్తోంది. ఇప్పటికే రైతుల ఇళ్లకు వెళ్లి పత్తిని తక్కువకు కొనుగోలు చేస్తున్న దళారులు.. తిరిగి వారి పంటనే, అది కూడా వారి పేరిటో సీసీఐలో మద్దతు ధరకు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. ఫలితంగా కష్టం చేసి పంట పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
భద్రాద్రి జిల్లా రైతులు ఈ ఏడాది 2,01,216 ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. 16 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీంతో సీసీఐ అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుగానే దళారులు రంగం సిద్ధం చేసుకున్నారు. రైతుల దగ్గర తక్కువ ధరకు కొని సీసీఐలో రూ.7521 మద్దతు ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక అధికారులు కూడా జిల్లాలో నాలుగు సీసీఐ కేంద్రాలను పేరుకే ఏర్పాటు చేసినట్లుగా కన్పిస్తోంది. ఆయా జిన్నింగ్ మిల్లుల వద్ద సీసీఐ కేంద్రాలు ప్రారంభించినా.. రైతులను మాత్రం రోజుల తరబడి పాడిగాపులు కాయిస్తున్నారు. సుజాతనగర్లోని మంజిత్ కాటన్ మిల్లు, కారేపల్లిలోని శ్రీలక్ష్మీకాటన్ మిల్లు, అశ్వాపురంలోని శ్రీరామ కాటన్ మిల్లు, లక్ష్మీపురంలోని అనుశ్రీ ఇండస్ట్రీస్లలో నిత్యం ఇదే పరిస్థితి కన్పిస్తోంది.
పత్తిని విక్రయించేందుకు సీసీఐ వద్ద రెండు రోజులుగా లైన్లో ఉన్నాను. తేమ శాతాన్ని సాకుగా చూపి రోజుల తరబడి ఆలస్యం చేశారు. ఒకవేళ విక్రయించినా నగదు కూడా ఆలస్యంగా జమ అవుతోంది. అదే సమయంలో ఇదే కేంద్రాల్లో ట్రేడర్లు వచ్చి విక్రయాలు చేసుకుంటున్నారు.
-కే.హనుమాన్, పాండురంగాపురం, పాల్వంచ
ఇదేమి సర్కారో అర్థం కావడం లేదు. పత్తిని అమ్ముకునేందుకు వచ్చే మాలాంటి రైతులకు ఇన్ని కష్టాలా? రోజుల తరబడి సీసీఐ కేంద్రాల్లోనే ఉంటే.. పంట చేలలో పనులు ఎలా చేసుకోవాలి? రెండు రోజులుగా మా బండిని లైన్లోనే పెట్టి ఉంచాను. దీంతో బండికి అద్దె పెరుగుతోంది.
-అంజయ్య, బేతాలపాడు, జూలూరుపాడు
రైతులు ఒక్కసారిగా జిన్నింగ్ మిల్లు వద్దకు రావడంతోనే లైన్లో వేడి ఉండాల్సి వస్తోంది. దీంతో కొనుగోళ్లలో వేగం పెంచాలని సీసీఐ అధికారులకు సూచించాం. తేమ శాతం ఎక్కువ ఉంటోందని సీసీఐ అధికారులు చెబుతున్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం. -నరేందర్, డీఎంవో, కొత్తగూడెం