కారేపల్లి, సెప్టెంబర్ 17 : కారేపల్లి మండలం గేటురేలకాయలపల్లి సమీపంలో ధర్మసోత్ సూర్యంకు చెందిన పోడు భూమిలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పత్తి పంటను ధ్వంసం చేశారు. ధర్మసోత్ సూర్యం పోడు భూమి రెండు ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశాడు. పత్తి పంట పూత, కాతకు వచ్చింది. సూర్యం బుధవారం పోడు భూమికి వెళ్లి చూడగా పత్తి చేను పీకివేసి ఉండడంతో ఆందోళన చెందాడు. పంటకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు, కాతకు వస్తున్న దశలో పత్తిని పీకివేయడంతో దిక్కుతోచని పరిస్ధితి నెలకొందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
ధ్వంసమైన పంట చేనును గిరిజన సంఘం మండల అధ్యక్షుడు అజ్మీర శోభన్‌బాబు, దారావత్ రవి పరిశీలించారు. పోడు భూమికి హక్కు పత్రం లేకపోవడం, పంట చేలో బూట్ల అచ్చులు ఉండడంతో ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేసి ఉంటారనే అనుమానంతో కారేపల్లి, ఇల్లెందు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా తాము ఆ ప్రాంతానికి రాలేదని వారు తెలిపారు. పత్తి పంటను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు.