కారేపల్లి, నవంబర్ 7: ఇటీవల కురిసిన మొంథా తుఫాన్ (Cyclone Montha) దాటికి ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో (Singareni) వందల ఎకరాల్లో పత్తి పంటకు (Cotton Crop) నష్టం వాటిల్లింది. మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షాల కారణంగా దిగుబడికి వచ్చిన పత్తి తడిసి ముద్దయింది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పత్తి క్రమంగా నల్లబడుతుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి అధిక పెట్టుబడులతో సాగు చేసిన పత్తి పంట అకాల వర్షం వల్ల దెబ్బతినడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. సగానికి పైగా దిగుబడులు తగ్గడంతోపాటు చేతికందిన పత్తి దూది వాన నీళ్లకు తడిసి నేల పాలవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి వైపరీత్యానికి నష్టపోయిన పత్తి మినహాయించి మిగిలిన పత్తిని దిగుబడి చేసుకునేందుకు సిద్ధమవ్వగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయాలు జరుపుకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీలను పెట్టి పత్తి తీసినప్పటికీ కొనేవారు లేకపోవడంతో నల్లబడి పోతున్నదని ఆందోళన చెందుతున్నారు.
పత్తాలేని వ్యవసాయ అధికారులు..
వర్షాల వల్ల వందల ఎకరాలలో పత్తి పంట దెబ్బతిన్న సంగతి తెలిసిందే. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. అయితే క్షేత్రస్థాయిలో పర్యటించి దెబ్బతిన్న పంట నష్టాలను అంచనా వేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు పత్తాలేరని ప్రజలు ఆరోపిస్తున్నారు. కార్యాలయాల్లోనే కూర్చొని తప్పుడు లెక్కలతో నష్టపోయిన రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా కారేపల్లి మండల కేంద్రంలో ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో సిబ్బంది తిరస్కరిస్తున్నారు.
పత్తి పంటకు నష్టం వాటిల్లల్లేదు..
ఇటీవల మండలంలో కురిసిన తుఫాన్‌కు ఎక్కడా పత్తి పంటకు నష్టం వాటిల్ల లేదని మండల వ్యవసాయ అధికారి బట్టు అశోక్ కుమార్ అన్నారు. మండల వ్యాప్తంగా 25వేల ఎకరాలలో రైతులు పత్తి పంట సాగు చేశారని చెప్పారు. వర్షాలకు 0.33శాతం పత్తి దెబ్బతింటే నష్టం జరిగినట్లు పరిగణలోకి తీసుకోవడం జరగదని వెల్లడించారు. జిల్లా మొత్తంలో ఇదే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు.