భూతల్లిని నమ్ముకొని ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్నల మెడపై దళారుల కత్తి ఎప్పుడూ వేలాడుతూనే ఉంటున్నది. సీజన్ ప్రారంభం నుంచీ అన్నదాతలను అన్నిరకాలుగా మోసం చేసేందుకు దళారులు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం పత్తి పంట చేతికొచ్చే సమయం కావడంతో ప్రైవేట్ వ్యాపారులు గ్రామాల్లో తిష్ట వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,01,216 ఎకరాల్లో పత్తి పంట సాగు కాగా.. దిగుబడి 16 లక్షల మెట్రిక్ టన్నులు రానున్నట్లు అధికారుల అంచనా.
అయితే ఇందులో సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం 6 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేయనుండడంతో ‘ప్రైవేట్ రాజ్యం’ కొనసాగనున్నది. ప్రభుత్వమే సరిపడా కొనుగోలు కేంద్రాలు పెట్టి మద్దతు ధరకు మొత్తం పంటను కొనుగోలు చేస్తే రైతన్నలు మోసపోయే పరిస్థితి ఉండదని పలువురు రైతు నాయకులు అభిప్రాయపడుతున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ)
రైతులు నానాకష్టాలు పడి పండిస్తున్న పత్తి పంటపై ప్రతి యేటా దళారులు మాటు వేసి వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఏకంగా ఇంటికెళ్లి మరీ పత్తిని కొనుగోలు చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాంటా తూకం పేరుతో, తరుగు పేరుతో మోసాలకు పాల్పడుతూ రైతులను నిలువునా ముంచుతున్నారు. ప్రతి ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా పత్తి పంటను సాగు చేస్తున్నారు.
ఈ ఏడాది కూడా 2,01,216 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా 16 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీంతో ఇప్పటినుంచే దళారులు పత్తిని కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో పత్తి సాగు కావడంతో.. దిగుబడి సైతం అదేస్థాయిలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరా తర్వాత కొన్ని ఏరియాల్లో పత్తితీతకు వచ్చే అవకాశాలు ఉన్నందున సీసీఐ ముందుగానే కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ నెల చివరికల్లా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్, వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకుగాను నిబంధనలను తయారు చేసింది.
Cotton Farmers
జిల్లాలో నాలుగుచోట్ల కొనుగోళ్లు..
పత్తిపంటను అమ్ముకునేందుకు రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో నాలుగు సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిన్నింగ్ మిల్లుల వద్ద సంబంధిత యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. జిల్లాలోని మంజిత్ కాటన్ మిల్లు సుజాతనగర్, శ్రీలక్ష్మి కాటన్ మిల్లు కారేపల్లి, శ్రీరామ కాటన్ మిల్లు అశ్వాపురం, అనుశ్రీ ఇండస్ట్రీస్ లక్ష్మీపురం ఏరియాల్లో కొనుగోలు చేయనున్నారు. దళారుల భారిన పడకుండా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పంటల వద్దనే తేమ శాతం తెలిపే యంత్రాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పత్తి కూపన్లు కూడా ఇస్తున్నారు. పత్తి క్వింటాకు రూ.7,521గా మద్దతు ధరను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఆన్లైన్లో రైతుల పేర్లు నమోదు
పత్తి పంటను విక్రయించే రైతుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ప్రతి రైతు ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్‌తోపాటు వేలిముద్రలను ప్రామాణికంగా తీసుకుంటారు. దీనివల్ల ఎవరి పంటను వారే విక్రయాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం మార్కెటింగ్ శాఖ నిబంధనలను ఖరారు చేసింది. విక్రయించిన పత్తి సొమ్ములు ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
దసరా తర్వాతే కొనుగోళ్లు..
జిల్లాలో ఈ ఏడాది పత్తి పంటను కొంచెం ఎక్కువగా సాగు చేశారు. సీసీఐ నాలుగు చోట్ల కేంద్రాలను అందుబాటులో ఉంచింది. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. ఆధార్ నెంబర్‌ను ఎన్రోల్ చేసుకొని విక్రయాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రూ.7,521గా ప్రభుత్వం గిట్టుబాటు ధరను ప్రకటించింది. బ్యాంకు ఖాతాను ఆధార్ నెంబర్‌తో లింక్ చేసుకోవాలి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాం. సీసీఐ కేంద్రాల్లోనే పత్తి విక్రయాలు చేసుకోవాలి.
– నరేందర్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం