వైరా టౌన్ (కొణిజర్ల), ఫిబ్రవరి 9 : పంట చేతికొచ్చే దశలో అధికారులు సాగర్ నీటిని నిలిపివేయడంతో మొక్కజొన్న బెండ్లు తాలుగా మారుతున్నాయని, పంట ఎండిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తూ కొణిజర్ల మండలం గుబ్బగుర్తి, అంజనాపురం, రామచంద్రాపురం, రాంపురం గ్రామాలకు చెందిన రైతులు ఏన్కూరుపల్లిపాడు రహదారిపై బైఠాయించి సోమవారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మొక్కజొన్న పంట చేతికొచ్చే దశలో ఎన్నెస్పీ గుబ్బగుర్తి, అంజనాపురం మేజర్లకు వారం పది రోజులుగా వారబందీ పేరుతో అధికారులు నీటి సరఫరా నిలిపివేయడంతో పంట ఎండిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టారు. ఈ ఏడాది పెద్ద మొత్తంలో మొక్కజొన్న సాగు చేశామని, గింజలు పాలు పోసుకునే దశలో నీళ్లు లేకపోతే ఆరుగాలం పడిన శ్రమ వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం, అధికారులు స్పందించి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో ఏన్కూరు, పల్లిపాడు రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సాగునీటి అంశాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పి ఆందోళనను విరమింపజేశారు. సోమవారం సాయంత్రం నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు ఎన్నెస్పీ అధికారులు ప్రకటించారు.