ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాలున్నా.. రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయాయి. దీంతో పలు సంఘాలను ఇతర సంఘాల్లో విలీనం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం సహకార సంఘాలకు ఊపిరిపోసింది. ప్రగతికి బాటలు వేసింది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని సొసైటీలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. వానకాలం, యాసంగి సీజన్ల రైతులకు విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాయి. ధాన్యం, మక్క కొనుగోళ్లు చేస్తున్నాయి. పెట్రోల్ బంక్‌ల నిర్వహణ, సూపర్ మార్కెట్లు, వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. రైతులకు ఏటా స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు అందజేస్తున్నాయి. అంతేకాదు, సహకార సంఘాల సేవలను విస్తృతం చేసేందుకు ప్రభుత్వం కొత్త సొసైటీలను ఏర్పాటు చేస్తున్నది. ప్రతి గ్రామానికి ఒక సొసైటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. జిల్లా సహకార కార్యాలయం పరిధిలో 76 సొసైటీలు ఉండగా.. మూడింతలు పెరిగే అవకాశం ఉంది. అంటే 235 నుంచి 240 వరకు కొత్త సొసైటీలు ఏర్పాటు కానున్నాయి.
ఖమ్మం ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి ) : సహకార సంఘాలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. గత పాలకుల హయాంలో కనీసం సంఘాలకు ఆదరణ లేక ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరాయి. పలు సంఘాలను ఇతర సంఘాల్లో విలీనం చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాల్లో సుమారు 300కి పైగా సొసైటీలు రైతులకు సేవలు అందించాయి. కాలక్రమేణ 2004 సంవత్సరంలో 215 సంఘాలకు పరిమితం కాగా.. 2014లో కేవలం 105 సంఘాలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.
రాష్ట్ర విభజన తర్వాత ఖమ్మం జిల్లా నుంచి కొన్ని మండలాలు ఆంధ్రాలో విలీనమయ్యాయి. మరో ఐదు సంఘాలు ఆంధ్రా రాష్ట్రం పరిధిలోకి వెళ్లాయి. 2018 జిల్లాల విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 76 సొసైటీలు మాత్రమే రైతులకు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని ప్రతి సొసైటీ లాభాల బాటలో పయనిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం చర్యల ఫలితంగా జిల్లాలో సహకారం సంఘాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. వానకాలం, యాసంగి సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువుల వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. ధాన్యం, మక్క కొనుగోళ్లు చేస్తున్నాయి. పెట్రోల్ బంక్‌ల నిర్వహణ, సూపర్ మార్కెట్లు, వాటర్ ఫ్లాంట్లు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. రైతులకు ఏటా స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు అందజేస్తున్నాయి.
మొత్తం సొసైటీల సంఖ్య 76
అత్యధిక సొసైటీలు కలిగిన మండలం : నేలకొండపల్లి (10)
ఒకే ఒక్క సొసైటీ కలిగిన మండలాలు : ఖమ్మంఅర్బన్, రూరల్, సింగరేణి, ఏన్కూరు, కొణిజర్ల
సాంకేతిక పరిజ్ఞానం.. ఆర్థికంగా బలోపేతం
ఖాతాదారులకు ప్రైవేటు బ్యాంక్‌లకు దీటుగా సేవలందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంఘాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో లావాదేవీలు మాన్యువల్‌గా జరిగాయి. పరిస్థితులకు అనుగుణంగా ఆన్లైన్ సౌకర్యాన్ని ఖాతాదారులకు చేరువ చేసింది. ప్రస్తుతం జిల్లాలోని 76 సొసైటీలను కంప్యూటరీకరణ చేయడంతో ఆడిట్ ఆన్లైన్లోనే జరుగుతున్నది. సహకార సంఘాలకు సొంత భవనాలు నిర్మించడమే కాకుండా వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా గోడౌన్లు నిర్మించారు. ఎరువుల, విత్తనాల వ్యాపారాలే కాకుండా సూపర్బజార్లు, మినరల్ వాటర్ప్లాంట్లు, ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు విస్తృత అవకాశాలను కల్పిస్తున్నది. గత వానకాలం సీజన్లో జిల్లాలో 76 సొసైటీల ద్వారా 1,90,222 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.
కొత్త సొసైటీల ఏర్పాటు దిశగా అడుగులు
మారుమూల గ్రామాల రైతులకు సహకార సంఘాల సేవలను విస్తృతం చేసేందుకు ప్రభుత్వం కొత్త సొసైటీల ఏర్పాటు చేస్తున్నది. ప్రతీ గ్రామానికి ఒక సొసైటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 906 సొసైటీలు ఉండగా.. తొలుత మరో 2006 సొసైటీలను ఏర్పాటు చేయనున్నది. జిల్లా సహకార కార్యాలయం పరిధిలో 76 సొసైటీలు ఉండగా.. మూడింతలు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో మరో 235 నుంచి 240 వరకు నూతన సొసైటీలు ఏర్పాటు కానున్నాయి.
21 మండలాలకుగాను 76 సొసైటీలుండగా.. నాలుగు మండలాల్లో కేవలం ఒక్కో సొసైటీ మాత్రమే సేవలు అందిస్తున్నది. ఖమ్మం అర్బన్‌లో టేకులపల్లి, రూరల్‌లో ఏదులాపురం, ఏన్కూరులో గార్లొడ్డు, కొణిజర్ల మండలంలో గోపవరంలో ఒక్కో సొసైటీ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ మండలాల్లో కొత్త సొసైటీలు ఏర్పడే అవకాశం ఉంది. అత్యధికంగా నేలకొండపల్లి మండలంలో 10, బోనకల్ మండలంలో 8 సొసైటీలు ఉన్నాయి. గతంలో సొసైటీ ఎన్నికల ముందే కొత్త సొసైటీల ఏర్పాటుకు జిల్లా సహకార కార్యాలయం 6 సొసైటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసింది. కొద్ది రోజుల్లోనే సొసైటీల ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నూతన సొసైటీల ఏర్పాటకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మారుమూల గ్రామాల రైతులకు సహకార సంఘాల సేవలు విస్తృతం కానున్నాయి.