మామిళ్లగూడెం, జూన్ 3: ఖమ్మం జిల్లాలో విపత్తుల సమయంలో జరిగే నష్టాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్డీఆర్ఎఫ్ బృందంతోపాటు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుడు వరదల కారణంగా ప్రభావితమైన ప్రాంతాలను ఎంపీడీవోలు మండలాల వారీగా, మున్సిపల్ కమిషనర్లు నగరాలు, పట్టణాల వారీగా గుర్తించి నివేదిక అందించాలని ఆదేశించారు.
జూన్ 15వ తేదీ నుంచి మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో కురిసే వర్షం వివరాలను కూడా ట్రాక్ చేస్తూ నదీ ప్రవాహాల వివరాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా జిల్లా అధికారులకు అందిస్తామని తెలిపారు. ప్రమాద హెచ్చరికలు ఎప్పటికప్పుడు గ్రామస్థాయికి చేరుకోవాలని, పంచాయతీ కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు, ఆపదమిత్రలు, గ్రామ గ్రూపుల్లో సమాచారం ఉండాలన్నారు. వరదల పరిస్థితులను కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ జరుగుతుందన్నారు.
అధికారులందరూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలపాటు 1077 టోల్ ఫ్రీ నెంబర్ కంట్రోల్ రూంలో ఉంటుందని, దీనికి వచ్చే ఫిర్యాదుల ప్రకారం అధికారులు స్పందించాలన్నారు. సీపీ సునీల్‌దత్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహకారం ఉంటుందన్నారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ మాట్లాడుతూ నగరంలో సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామన్నారు.
అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వల్నరబుల్ ప్రాంతాల్లో మాక్‌డ్రిల్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ గౌతమ్‌కుమార్, డీఆర్వో పద్మశ్రీ, జడ్పీ సీఈవో దీక్షారైనా, డీఆర్డీవో సన్యాసయ్య, ఎన్డీఆర్ఎఫ్ బృందం ఏఎస్ఐ మద్దిలేటి, బృందం జగదీశ్, సురేష్‌కుమార్, రిజాజుద్దీన్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.