– ఇల్లెందు మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటిపై బంధువుల దాడి
– ఆర్థిక లావాదేవీలే ఆత్మహత్యకు కారణమని మృతుడి భార్య ఫిర్యాదు
కారేపల్లి, సెప్టెంబర్ 06 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని మొట్లగూడెం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ గడిపర్తి శ్రీను (50) శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గడిపర్తి శ్రీను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మాజీ మున్సిపల్ చైర్మన్ (ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు) దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డివి) ఓకే సామాజిక వర్గానికి చెందిన వారు. వరుసకు బావబామ్మర్దులు. గత రెండు దశాబ్దాలుగా వీరిద్దరితో పాటు ఇంకొంత మంది మధ్య ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఇల్లెందు నియోజకవర్గంతో పాటు మున్సిపాలిటీలో జరిగిన పలు అభివృద్ధి కాంట్రాక్ట్ పనులకు గడిపర్తి శీను పెట్టుబడి పెట్టాడు. గత కొంతకాలంగా ఆర్థిక లావాదేవీలపై బావబామ్మర్దులకు విభేదాలు తలెత్తాయి. దీంతో పలుసార్లు పెద్దలతో కలిసి చర్చలు కూడా జరిపారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రి ఖమ్మం పట్టణంలో కొందరి సమక్షంలో ఇరువురు ఆర్థిక లావాదేవీలపై చర్చించారు.
ఈ చర్చల్లో తనకు న్యాయం జరగలేదని మనస్థాపానికి గురైన గడిపర్తి శ్రీను కారేపల్లి మండల పరిధిలోని మోట్లగూడెం సమీపంలో తన కారులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగ్రహించిన శ్రీను కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని ఇల్లెందు పట్టణంలోని మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఇంటికి తీసుకువెళ్లి ఆవరణలో ఉంచి ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు డివి ఇంటి అద్దాలతో పాటు కారు అద్దాలు ధ్వంసం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులతో చర్చించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తన భర్త ఆత్మహత్యకు గల కారకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గడిపర్తి శ్రీను భార్య గడిపర్తి రమ శనివారం కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దమ్మాలపాటి వెంకటేశ్వరరావు సుమారు రూ.1.5 కోట్లు ఇవ్వాల్సి ఉన్నట్లు తన భర్త చెప్పగా ఇద్దరూ కలిసి వెళ్లి డబ్బులు అడిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై ఖమ్మం పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన చర్చల్లో డీవీ బంధువు, సోదరుడు దమ్మాలపాటి ప్రసాద్ అనే వ్యక్తి తన భర్త పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసిందని ఫిర్యాదులో వెల్లడించింది. దీంతో మానసిక వేదనకు గురై తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, అందుకు కారకులన దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డీవి), అతడి కుటుంబ సభ్యులు, బంధువు దమ్మాలపాటి ప్రసాదు పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె పేర్కొంది.