టేకులపల్లి, జూన్ 7 : వేతనాలు పెంచకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్టు కార్మికుల శ్రమను ఏళ్లతరబడి దోచుకుంటున్నాయని ఆరోపిస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(టీయూసీఐ) ఆధ్వర్యంలో టేకులపల్లిలో కాంట్రాక్టు కార్మికులు ఆదివారం నిరసన తెలిపారు. తొలుత సింగరేణి హైటెక్ కాలనీలో కాంట్రాక్టు కార్మికులతో సమావేశమైన ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ యాకూబ్ షావలి తర్వాత కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో వచ్చిన లాభాల్లో రాష్ట్ర ప్రభుత్వం 51 శాతం, కేంద్ర ప్రభుత్వం 49 శాతం వాటాలు పంచుకుంటున్నాయి తప్ప కార్మికుల వేతనాల పెంపు గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కనీసం వేతన జీవో సవరణ చేయడం లేదని, ఏళ్లు గడుస్తున్నా కార్మికుల శ్రమను దోపిడీ చేయడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వేతనాలు అస్పష్టంగా ఉన్నాయని, వెంటనే వాటిని పునఃపరిశీలన చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు జర్పుల సుందర్, శివయ్య, రామారావు, ప్రసాద్, బాల సూర్యదేవా, బాలు, రాజేశ్, ఎర్రమ్మ, నాగమణి, చంద్రకళ పాల్గొన్నారు.