ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 10: కాకతీయ యూనివర్సిటీలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా చేసేందుకే ప్రభుత్వం జీవో 21ని తెచ్చిందని యూనివర్సిటీ కాంట్రాక్ట్, పార్ట్‌టైం అధ్యాపకులు ఆరోపించారు. జీవో 21కి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద బుధవారం జరిగిన ఆందోళనలో కాంట్రాక్ట్ అధ్యాపకులను ప్రభుత్వం అరెస్టు చేయించినందుకు నిరసనగా ఖమ్మంలోని యూనివవర్సిటీ పీజీ, వ్యాయామ కళాశాలల అధ్యాపకులు గురువారం తరగతులు బహిష్కరించారు.
అనంతరం కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్, పార్ట్‌టైం అధ్యాపకులు మాట్లాడుతూ.. అన్ని అర్హతలూ కలిగి 30 ఏళ్లుగా యూనివర్సిటీలో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించకుండా నేరుగా నియామకాలు చేపట్టే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రిన్సిపాల్ చేకూరి రవికుమార్, గోపి, శ్యాంబాబు, కోటి, శేఖర్, మధు, రవిబాబు, వీరన్న, రాజీవ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.