బోనకల్లు, ఏప్రిల్ 05 : ఉపాధ్యాయుల సమస్యలపై తొందరలోనే ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తారని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు తెలిపారు. బోనకల్లులో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7న శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని సాధ్యమైనంత తొందరలో పరిష్కారమయ్యేలా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహిళలకు ఇచ్చే చైల్డ్ కేర్ లీవ్ ను వారి సర్వీస్ కాలంలో మొత్తం వినియోగించుకునేలా, మైనారిటీ గురుకుల పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాత టైమ్ టేబుల్ విధానాన్ని కొనసాగించేలా చూడనున్నట్లు వెల్లడించారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేల్ వర్తించేలా ప్రత్యేకంగా మాట్లాడుతారన్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి జాప్యం లేకుండా బెనిఫిట్స్ వెంటనే అందేలా తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు. సీపీఎస్ రద్దు యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ సాధన కోసం నిరంతరం శ్రమిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు రెబ్బా శ్రీనివాసరావు, దిలకత్తుల వెంకటరమణ, లింగం, సతీశ్ పాల్గొన్నారు.