ఖమ్మం, ఆగస్టు 6 : జాతీయ రహదారుల నిర్మాణాలను గడువులోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందనతో ఉమ్మడి ఖమ్మంజిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారుల నిర్మాణాల మంజూరు, ప్రగతిపై హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమీక్షించారు. హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై ఖమ్మం నుంచి సూర్యాపేట ఎంట్రీ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సత్వరమే ప్రారంభించాలని, ఖమ్మం- దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనుల ప్రగతి, ఖమ్మం- దేవరపల్లి ధంసలాపూరం వద్ద ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్ల కోసం అయ్యే భూసేకరణ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, దానికి అనుగుణంగా ఎన్హెచ్ఏఐకి లేఖ రాయాలని అన్నారు.
ధంసలాపురం ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్ల నుంచి గ్రీన్‌ఫీల్డ్ హైవే వెంబడి కలెక్టరేట్ వరకు సర్వీస్ రోడ్లలను కూడా పూర్తి చేసినట్లయితే ఖమ్మంలో ట్రాఫిక్ నియంత్రణకు మరింత సహకరిస్తుందని తెలిపారు, సర్వీస్ రోడ్లను సత్వరమే మంజూరు చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఖమ్మం- కురవి రోడ్డు, ఖమ్మం- కోదాడ రోడ్డు పురోగతిపై సమీక్ష చేశారు.
నెహ్రూనగర్- కొత్తగూడెం జాతీయ రహదారి, టెండర్ల దశలో ఉందని, టెండర్ పూర్తికాగానే వాటి నిర్మాణపనులు మొదలు పెడతామని హరిచందన తెలిపారు. చిల్లకల్లు (హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి) క్రాస్‌రోడ్డు నుంచి బోనకల్లు, వైరా, తల్లాడ నుంచి కొత్తగూడం వరకు జాతీయ రహదారి మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, త్వరలోనే మంజూరు అవుతుందని మంత్రి తుమ్మల తెలిపారు.