టేకులపల్లి, ఫిబ్రవరి 24: చుట్టూ పెద్ద పెద్ద గుట్టలు. మధ్యలో అడవి. అందులో మూడు గ్రామాలున్న పంచాయతీ. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు. ఆ పంచాయతీ పేరు.. రోళ్ళపాడు. వెనుకబడిన ఆ పంచాయతీపై ఎమ్మెల్యే హరిప్రియానాయక్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అంతే.. దానికి మహర్దశ పట్టింది. రూపురేఖలు మారిపోతున్నాయి. ఈ పంచాయతీలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే హరిప్రియానాయక్ రూ.40 లక్షల(ఎన్ఆర్ఈజీఎస్ నుంచి రూ.30 లక్షలు, డీఎంఎఫ్ నుంచి రూ.10 లక్షలు) కేటాయించారు. ఈ మొత్తంతో ఒకేసారి ఎనిమిది సీసీ రోడ్ల నిర్మాణం (రుక్మాతండాలో నాలుగు, బీల్యాతండాలో రెండు, రోళ్ళపాడులో రెండు) శుక్రవారం మొదలైంది. వీటికి ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ శంకుస్థాపన చేశారు. ప్రజలతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్ట్ అభివృద్ధి నేపథ్యంలో మారుమూల గ్రామమైన రోళ్ళపాడు ఇప్పటివరకూ వెనుకబడిందని చెప్పారు.
ఈ పంచాయతీ అభివృద్ధిపై తాను దృష్టి కేంద్రీకరించానన్నారు. త్రీ ఫేస్ విద్యుత్ ఏర్పాటు చేస్తున్నామని, అంతర్గత రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని అన్నారు. రాబోయే కాలంలో రోళ్ళపాడు పంచాయతీని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. రోళ్ళపాడు పాఠశాలను సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. రోళ్ళపాడులోని కంటి వెలుగు కేంద్రాన్ని పరిశీలించారు. సర్పంచులు ధరావత్ లలిత, మాలోత్ సురేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్, నాయకులు లక్కినేని శ్యామ్‌బాబు, బదావత్ లాల్‌సింగ్ నాయక్, బానోత్ రామానాయక్ తదితరులు పాల్గొన్నారు.