లక్ష్మీదేవిపల్లి, అక్టోబర్ 27: నిరసన తెలిపిన ఐదుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సహచర కానిస్టేబుళ్లు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త నిరసనలో పాల్గొన్న 39 మందిపై కూడా సస్పెన్షన్ వేటును తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా 9,900 మంది బెటాలియన్ పోలీసులం స్వచ్ఛందంగా రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు.
తమ భర్తలతో వెట్టి చాకిరి చేయించొద్దని; ఒకే యూనీఫాం, ఒకే రూల్, ఒకే ఈవెంట్, ఒకే ఎగ్జామ్ ఉండాలని డిమాండ్ చేస్తూ బెటాలియన్ పోలీసుల భార్యలు, కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బెటాలియన్ల వద్ద శనివారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం విదితమే.
అందులో భాగంగా కొత్తగూడెంలోని చాతకొండ బెటాలియన్‌లోనూ నిరసన వ్యక్తం చేశారు. అయితే, ఇందులో పాల్గొన్న కే.భూషణ్‌రావు, పులిరాజు, వెంకటేష్, నయీం, రవికిరణ్ అనే ఐదుగురు బెటాలియన్ కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
అయితే తమ సమస్యలు పరిష్కరించాలని, ఈ ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం సరికాదని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సహచర కానిస్టేబుళ్లు ఆదివారం రెండో రోజూ ఆందోళనను కొనసాగించారు. కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పదే పదే బదిలీలు చేపట్టకుండా ఐదేళ్లపాటు ఒకే చోట విధులు నిర్వహించేలా అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం ఆరో బెటాలియన్ కమాండెంట్‌కు వినతిపత్రం అందించారు. ఇదే డిమాండ్‌పై సాయంత్రం వరకూ ధర్నాను కొనసాగించిన బెటాలియన్ కానిస్టేబుళ్లు.. ఆదివారం రాత్రి బెటాలియన్ ఆవరణలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు.