కారేపల్లి, మే 11 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవైసీ పేరుతో ఉపాధి కూలీల సంఖ్య కుదింపునకు కుట్ర చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండెబోయిన నాగేశ్వరరావు విమర్శించారు. సోమవారం కారేపల్లి మండలం మాణిక్యారంలో ఉపాధి పని ప్రాంతాన్ని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులతో కలిసి సందర్శించి కూలీలతో మాట్లాడారు. ఈసందర్బంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఉపాధీ కూలీలు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని గడువు పెట్టిందని, గడువు ఈ 11వ తేదితో ముగిసిందన్నారు. ఈ కేవైసీ ప్రాధాన్యత తెలియక చాలామంది కూలీలు కేవైసీ చేయించుకోలేదన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా కేవైసీ చేయించుకోని వారి సంఖ్య 3 లక్షలపైగా ఉందన్నారు. వారందరు నష్టపోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం కేవైసీ గడువు పెంచడతో పాటు కేవైసీ ప్రాధాన్యతనపై చైతన్యం చేయాలన్నారు.
రోజు వారి కూలీ రూ.307 ఇవాల్సి ఉండగా ప్రస్తుతం రూ.150 కూడా పడడం లేదన్నారు. పని ప్రదేశాలలో టెంట్, నీరు, మెడికల్ కిట్స్ కల్పించడం లేదన్నారు. కూలీలకు ప్రమాధ బీమా కేంద్రం ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్లతో ఈ నెల 15న గ్రామీణ బంద్‌లో భాగంగా ఉపాధి బంద్, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధీ కూలీలు హక్కులు, పని దినాలు, కూలి పెరగాలంటే పోరాటాలకు మద్దతు తెలుపాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా వైరా డివిజన్ అధ్యక్షురాలు కే.ఉమావతి, నాయకులు పి.నాగేశ్వరరావు, గోపాలు, వీరబాబు పాల్గొన్నారు.