టేకులపల్లి, జూలై 14 : అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. మండలంలోని ముక్కంపాడు, బోడు పంచాయతీల్లోని పలు గ్రామాల్లో సోమవారం ఆమె విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజలు, కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరిప్రియ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అంటూ ప్రజలను నమ్మించి మోసం చేసిందని, హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు.
కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ఇప్పుడు కనిపిస్తున్న అభివృద్ధి అంతా గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిందేనని ఆమె గుర్తు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఆమె కోరారు. కార్యక్రమంలో నాయకులు బొమ్మెర వరప్రసాద్, బానోత్ రామానాయక్, భద్రం, నర్సింహారావు, ప్రశాంత్, ఎట్టి ప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు.