హైదరాబాద్ ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : ‘అయ్యా పెద్దసారు.. మేము బడుగలం. బలం లేనోళ్లం. అణగారిన బిడ్డలం.. దళితులమయ్యా. మా తాన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మా ఇండ్లు కబ్జాబెట్టిండు. అభివృద్ధి పేరుతో ఇండ్లు ఖాళీ జెయ్యాలని అంటుండు. ఇండ్లు ఇడ్సిపెట్టి పోకపోతే హైదరాబాద్ బుల్డోజర్లను ఇక్కడ దించుతడట. వాటితోనే తొకిస్తనని బెదిరిస్తుండు’ అంటూ వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయం పక్కన నివాసం ఉంటున్న 55 దళిత కుటుంబాలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఎదుట మొరపెట్టుకున్నా యి. గురువారం ఉదయమే వరంగల్ నుంచి చిన్నపిల్లలతో సహా తరలివచ్చిన భూ బాధిత కుటుంబాలు.. బీఆర్ఎస్ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర మా నవహక్కుల కమిషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. ‘మా భూములు మాగ్గావాలి’ ‘మాకు తాగునీళ్లు ఇప్పించండి’ ‘మా భూము లు ఎవ్వరికీ ఇచ్చేది లేదు’ ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలతో ఆవరణలో హోరెత్తించారు. అనంతరం ఎస్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్‌కు తమ గోడు వెలిబుచ్చా రు. ‘భద్రకాళి పకన దళితులేందిరా?’ అని బెదిరింపులకు దిగుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నో ఏండ్ల నుంచి అక్కడే ఉంటున్నామని తక్షణమే ఖాళీ చెయ్యాలని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, అతని అనుచరులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
నెలన్నర కింద నుంచి తమను ఇబ్బందు లు పెడుతున్నారని ఎస్హెచ్ఆర్సీ చైర్మన్‌కు వరంగల్ దళితులు విన్నవించారు. ఇండ్లు ఖాళీ చేయకపోవడంతో నెలరోజులుగా తాగునీళ్లు బంద్ చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. కరెంట్ సరఫరా తొలగించి ఇబ్బందులు పెట్టారని వాపోయారు. ఈ విషయంపై తాము నిత్యం ఆందోళనలు చేస్త్తున్నామని చెప్పారు. తాగునీళ్లు ఇవ్వకపోవడంపై కలెక్టర్‌ను కలిసినా ఉపయోగం లేకపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాగానే అందరితో పాటు తమ 55 కుటుంబాలకు కూడా నల్లా లు పెట్టి తాగునీళ్లు ఇచ్చారని చెప్పారు. ఇప్పు డు ఆ ఇండ్లను ఖాళీ చేయించాలనే దురుద్దేశం తో తాగునీళ్లు బంద్ చేయించారని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో కిలోమీటర్ల కొద్ది వెళ్లి మరీ నీళ్తు తెచ్చుకుంటున్నామని చెప్పారు. ఇటీవల రాత్రిపూట ఇంటికి పిలిచి ఎమ్మెల్యే అవమానకరంగా మాట్లాడారని, ఇండ్లు ఖాళీ చేయకపోతే జేసీబీలతో తొకించి చంపుతామనని వారి అనుచరులు బెదిరించారని బోరున విలపిస్తూ విన్నవించుకున్నారు.
ఇప్పుడు తాము నివసిస్తున్న స్థలం 70 ఏండ్ల కింద గుట్టలుగా ఉండేదని, అలాంటి స్థలాన్ని రాళ్లుకొట్టి చదును చేసుకొని నివాసం ఉంటున్నామని బాధితులు చెప్పారు. రాళ్ల దెబ్బలు తాకి కొందరు అవిటివారు కాగా.. 10 మందికిపైగా కండ్లకు దెబ్బలు తగిలి చూపు పోయిందని పేర్కొన్నారు. కనుచూపు పోయిన వారిలో ఒకడైన వృద్ధుడు గోవిందు రత్నం తన గోసను జస్టిస్ షమీమ్ అక్తర్‌కు విన్నవించాడు. ‘కండ్లచూపు పోయినా కూడా.. నా బిడ్డల బతుక్కోసం అక్కడే ఉంటున్న. గతంలో ప్రభుత్వం నీళ్లు, కరెంటు ఇచ్చి, పట్టాలు పంచితే.. ఇప్పు డు ఈ ప్రభుత్వం వాటన్నింటినీ లాక్కోవాలని చూడటం దుర్మార్గం సారూ’ అంటూ విలపిస్తూ విన్నవించుకున్నాడు. ‘మా ప్రాణాలు పోయినా అక్కడ్నుంచి కదిలేది లేదు’ అంటూ బాధితులంతా తేల్చి చెప్పారు.
వరంగల్ నగరం నడిబొడ్డున దళిత బిడ్డల హక్కులు కాలరాస్తుంటే ప్రభుత్వ యంత్రాం గం చేష్టలుడిగి చూస్తుండటంపై ఎస్హెచ్ఆర్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మొదట బాధితులకు తాగునీటి వ్యవస్థను పునరుద్ధరించాలని కలెక్టర్, ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చింది. మౌలిక సదుపాయాల కల్పనలో చూపిస్తున్న అలసత్వంపై అసహనం వ్యక్తంచేసింది. చైర్మన్ మానవతా దృక్పథంతో స్పందించి.. బాధితుల పక్షాన నిలువడంతో అటు బాధితులు, బీఆర్ఎస్ నేతలు కృతజ్ఞత లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం, బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తుంగబాలు, బాధిత కుటుంబాలు పాల్గొన్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అరాచకాలను అడ్డుకోవాలని మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఎస్హెచ్ఆర్సీని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాధిత దళిత కుటుంబాల ఇబ్బందులను కలెక్టర్, ఎమ్మెల్యే పట్టించుకోకపోగా.. హైడ్రాను తీసుకొచ్చి ఇండ్లు కూలగొట్టిస్తామడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్‌లా పనిచేస్తుందని తెలిపారు. బాధిత దళితులకు న్యాయం చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
‘రేవంత్‌రెడ్డీ.. దళిత బిడ్డలపైనా నీ ప్రతా పం.. దళితుల, గిరిజనుల జోలికొస్తే.. అక్కడ కచ్చితంగా బీఆర్ఎస్ నీకు ఎదురు నిలబడ్తది.. నీ చర్యలను అడ్డుకుంటది’ అని డాక్టర్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. కమిషన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రేవంత్ పాలనలో దళితులపై, గిరిజనులపై, బీసీలపై ని రంతరం దాడులు జరుగుతున్నాయని, మ హిళలకు, వృద్ధులకు కూడా రక్షణ లేదని ఆందోళన వ్యక్తంచేశారు. దళితుల భూములను లాకోవాలని కుట్ర చేయడం దారుణమని పేర్కొన్నారు. భద్రకాళి అమ్మవారి సాక్షిగా 55 దళిత కుటుంబాల భూమిని అభివృద్ధి పేరుతో లాక్కోవాలని చూడటం గర్హనీయమని పేర్కొన్నారు. దళితులను అ క్కడ్నుంచి గెంటివేయాలనే దురుద్దేశంతోనే నీళ్లు, కరెంట్ బంద్ చేయడం, వారిని రోడ్డు కు ఈడ్చడం అక్రమమని, ఇదేనా నీ ప్రజాపాలన అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
అయ్యా! ఓ రేవంత్‌రెడ్డి దొరా.. మీకు మా దళితుల భూమే దొరికిందా? ఇక్కడ్నే పుట్టినం.. ఇక్కడే పెర్గినం. నీ ఎమ్మెల్యే ఎట్ల బెదిరిస్తుండో తెల్సుకో. రాత్రిపూట ఇంటికి ఆడబిడ్డల్ని పిల్సిమరీ తిడుతుండు. బుల్డోజర్లతో తొక్కిస్తమని అంటుండు. ఇదేనా మీ పెజాపాలన? నాడు కేసీయార్ సారు నీళ్లిస్తే.. నువ్ నెలరోజులు బంజేయిస్తవా? కరెంటు పీకిస్తావా? నీ ఎమ్మెల్యేకి ఎంత కండకావరం?.. బిడ్డా మా దళితుల జోలికొస్తే.. బండలు కొట్టిన చేతుల్తోనే బొందవెడ్తం.. జాగ్రత్త! – కొమురయ్య, చరబండరాజు కాలనీ, వరంగల్
అయ్యా రేవంత్ గారూ.. మీరు, మీ నాయకులు రాజ్యాంగం చేతబట్టుకొని పోజులు కొట్టడం కాదు.. చేతనైతే చేతల్లో అమలు చేసి చూపించండి. మా ఇండ్లు ఖాళీ చెయ్యాలని నెలన్నర సంది ఇబ్బందులువెడ్తున్నరు. నెలరోజుల సంది నీళ్లిస్తలేరు. భద్రకాళి అమ్మవారి గుడిపక్కన దళితులేందిరా? అని బెదిరిస్తున్నారు. మీ ఎమ్మెల్యే నానా అరాచకాలు జేస్తుండు. అందుకే హైదరాబాద్ దాంక వచ్చినం. మా భూమి మాగ్గావాలె.