వైరాటౌన్, డిసెంబర్ 2 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పిలుపునిచ్చారు. కేజీ సిరిపురం గ్రామంలో కామినేని శ్రీనివాసరావు నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, అక్రమ కేసులు బనాయించడం, విత్డ్రా చేయించడం వంటి చర్యలకు కాంగ్రెస్ నాయకులు పాల్పడుతున్నారని ఆరోపించారు.
కామారెడ్డిలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో కేవలం 9 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చి బీసీలను మోసం చేసిందని మండిపడ్డారు. జిల్లాలో అత్యధిక బీసీ జనాభా ఉన్న రఘునాథపాలెం, తిరుమలాయపాలెం మండలాల్లో బీసీలకు ఇచ్చింది జీరో రిజర్వేషన్లు అని, దీనినిబట్టి బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించి శ్వేతపత్రం విడుదల చేయాలని జిల్లాలోని ముగ్గురు మంత్రులను డిమాండ్ చేశారు.
నేలకొండపల్లి మండలం శంకరగిరితండాలో గిరిజన యువ రైతు వీరన్న ఆత్మహత్యను ప్రభుత్వ హత్యగా ఆయన అభివర్ణించారు. రుణమాఫీ, కౌలు రైతులకు భరోసా రాకపోవడం వంటి కారణాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనికి జిల్లా మంత్రులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పత్తికి కనీస మద్దతు ధర రూ.6 వేల చొప్పున కూడా కొనడం లేదని, మార్కెట్లలో దళారుల దందా పెరిగిపోయి రైతులను నిండా ముంచుతున్నా కనీసం మంత్రులకు నియంత్రణ లేకపోవడం దారుణమన్నారు.
రుణమాఫీ, తులం బంగారం, స్కూటీలు, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఇచ్చి కాంగ్రెస్ నేతలు ప్రజలను నిలువునా మోసం చేశారని, సీఎం తన సొంత గ్రామంలో రుణమాఫీ అమలు చేయలేక సవాళ్లను స్వీకరించలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కేంద్రం నుంచి 20 అవార్డులు వస్తే.. 1617 అవార్డులు తెలంగాణ గ్రామాలకు వచ్చేవని ఆయన గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో గ్రామాల్లో పారిశుధ్యం కుంటుపడిందని, మురికి కాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోయాయని, పార్కులు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ ఇచ్చిన ట్రాక్టర్లకు డీజిల్ కొనలేని పరిస్థితి ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఏర్పడిందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నైజాన్ని, మోసాలను ప్రజలందరూ అర్థం చేసుకొని బీసీలను, రైతులను, మహిళలను మోసం చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కట్టా కృష్ణార్జున్రావు, బాణాల వెంకటేశ్వరరావు, మద్దెల రవి, వనమా విశ్వేశ్వర్రావు, మాదినేని ప్రసాద్, దొంతబోయిన వెంకటేశ్వర్లు, సర్పంచ్ అభ్యర్థి శెట్టిపల్లి శ్రీనివాసరావు, ఐనాల కనకరత్నం తదితులు పాల్గొన్నారు.