ముదిగొండ, అక్టోబర్ 06 : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజ్ అన్నారు. ముదిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తే, ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కేంద్రం నుండి నిధులు రావని ఎన్నికలు జరుపుతున్నారే తప్పా ఇప్పట్లో ఎన్నికలు జరపాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని, పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం వ్యూహ రచనలు చేయాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఎంత బాకీ పడ్డదో బాకీ కార్డు ద్వారా తెలియజేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు అడగటానికి వస్తే ఈ బాకీ కార్డు చూపించి నిలదీయాలని సూచించారు. 90 రోజుల్లో పథకాలు అమలు చేస్తామని చెప్పి 20 నెలలు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు పరిపాలనను గాలికి వదిలేసి ఒకరు భూములు, ఒకరు వర్కులు, ఒకరు ప్రాజెక్టులు దోచుకోవడంలో బిజీగా ఉన్నట్లు తెలిపారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొంత సర్దుకుపోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉన్నందున స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎన్నికల్లో ముందుకు సాగాలన్నారు.
సిపిఎం పార్టీ నుంచి కూడా పొత్తు పెట్టుకుందామన్న సంకేతం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించాలని తాము కూడా కసితో ఉన్నట్లు, కలిసి పనిచేద్దామని ప్రతిపాదన తెచ్చినట్లు చెప్పారు. బలంగా ఉన్న మనం మంచి పరిణామం కోసం మరికొంత బలం చేకూర్చుకోవాలని అన్నారు. కావునా పార్టీకి నష్టం జరగకుండా సమాలోచనలు జరిపి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి వచ్చే శాసనసభ ఎన్నికల్లో కూడా అదే ఫలితాలు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకటేశ్వర్లు, సామినేని హరిప్రసాద్, పోట్ల ప్రసాద్, బంక మల్లయ్య, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.