సీతారామ ఎత్తిపోతల పథకం నీటిని కాంగ్రెస్ పాలకులు ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగం భగ్గుమంటోంది. వాస్తవానికి దుమ్ముగూడెం వద్ద గోదావరిపై ‘సీతారామ’ నిర్మించి అక్కడి నుంచి కాలువ ద్వారా రోళ్లపాడు, బయ్యారం చెరువులు నింపడం, మరో కాలువ ఖమ్మంలోని పాలేరు చెరువు వరకు నిర్మించి మొత్తం ఖమ్మం ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయాలని బీఆర్ఎస్ హయాంలో డిజైన్ చేశారు. జూలూరుపాడు వరకు కాలువ సైతం పూర్తయింది.
కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇక్కడి నుంచి ఆగమేఘాల మీద రూ.92 కోట్ల్లు ఖర్చుపెట్టి 9 కిలోమీటర్ల కాలువ నిర్మించి ఖమ్మం జిల్లాలోని సాగర్ కాలువకు కలిపి గోదావరి నీటిని తరలిస్తున్నారు. రోళ్లపాడు, బయ్యారం చెరువుల వరకు కాలువ నిర్మించాల్సి ఉండగా.. ఆ ఊసెత్తకుండా ఇప్పటికే రెండు పంటలు పండుతున్న ఖమ్మం మైదాన ప్రాంత భూములకు నీటిని తరలించడంతో భద్రాద్రి జిల్లా రైతులు తమకు అన్యాయం జరిగిందని లబోదిబోమంటున్నారు. మొట్టమొదట భద్రాద్రి జిల్లాకు సాగునీటిని అందించాకే ఖమ్మం జిల్లాకు తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. – ఇల్లెందు, జూలై 5
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. దానిలో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం వద్ద గోదావరి నదిపై సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, పినపాక, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో వైరా, మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్, మహబూబాబాద్ తదితర నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చే ఉద్దేశంతో నిర్మించారు.
తొలి విడతలో రూ.1,395 కోట్ల అంచనాతో కాలువ నిర్మాణ పనులు సాగాయి. దుమ్ముగూడెం వద్ద నుంచి సుమారుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం 112 కిలోమీటర్ల కాలువ కోసం భూసేకరణ చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే జూలూరుపాడు వరకు కాలువ సైతం నిర్మించారు. అక్కడి నుంచి చీమలపాడు, లలితపురం మీదుగా రోళ్లపాడు, బయ్యారం చెరువులోకి ఒక కాలువ, పాలేరులోకి మరొక కాలువ నిర్మించాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జూలూరుపాడు నుంచి ఆగమేఘాలతో రూ.92 కోట్లు ఖర్చుపెట్టి 9 కిలోమీటర్ల కాలువ నిర్మించి ఖమ్మం జిల్లాలోని సాగర్ కాలువకు కలిపింది. అంతేకాదు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని తరలిస్తున్నది. దీంతో ఒక పక్క ఏజెన్సీ ప్రాంతం ఎండుతుంటే.. మూడో పంట కోసం నీటిని తరలించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తానికి సాగునీరు ఇచ్చేందుకు నిర్మించిన సీతారామ ప్రాజెక్టు నీటిని కాంగ్రెస్ ప్రభుత్వం పక్క జిల్లాకు తరలిస్తూ ఏజెన్సీ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నదని రైతులు వాపోతున్నారు. సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన నాటి నుంచి తమ భూములకు నీళ్లొస్తాయని ఆశ పెట్టుకున్న రైతులకు భంగపాటు ఎదురైంది. ఇంత జరుగుతున్నా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడంతో అన్నదాతలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
సీతారామ ప్రాజెక్టు ద్వారా తొలుత భద్రాద్రి జిల్లాలోని రోళ్లపాడు, బయ్యారం చెరువులకు, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలోని పాలేరు చెరువుకు సాగునీటిని అందించేందుకు పనులు ప్రారంభించారు. తీరా నోటికాడికి వచ్చేసరికి వాటి ఊసేలేకుండా డిజైన్ మార్చి సత్తుపల్లికి నీరు తీసుకెళ్తున్నారు. భద్రాద్రి జిల్లా రైతులు తిరగబడకముందే ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలని కోరుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి పారుతున్నది.. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు చెందిన కాలువల భూములు ఈ జిల్లా రైతులవే. కానీ.. ఇక్కడి భూములకు నీరు ఇవ్వకుండా.. రెండు పంటలు పండుతున్న ఖమ్మం జిల్లాలోని మైదాన ప్రాంతానికి తీసుకెళ్లడం సరికాదు. సాగర్ నీరు పారుతున్న ప్రాంతానికి నీళ్లు తరలించుకుపోతుంటే జిల్లా ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్టు? ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలి.
– బానోత్ హరిప్రియానాయక్, మాజీ ఎమ్మెల్యే, ఇల్లెందు
ఎలాంటి నీటి ఆధారం లేని గిరిజన ఏజెన్సీ ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మించ తలపెట్టారు. అలాంటి సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాకు చుక్కనీరు ఇవ్వకుండా ఖమ్మం జిల్లా మైదాన ప్రాంతానికి తరలించడం సరికాదు. భద్రాద్రి రైతులకు అన్యాయం చేయాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. సాగునీటి కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
– దిండిగాల రాజేందర్, బీఆర్ఎస్ నేత, ఇల్లెందు
నా వయస్సు 75 యేండ్లు. చిన్నతనం నుంచి వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం. ప్రతి యేటా ఇల్లెందు నియోజకవర్గం పరిధిలో సరైన నీటి సౌకర్యం లేక పంటలు ఎండిపోతున్నాయి. నీటి వనరులు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి భూములకు ‘సీతారామ’ నీళ్లొస్తాయని ఆశపడ్డాం. కానీ.. కాంగ్రెస్ నాయకులు నీటిని తరలించడం అన్యాయం.
– వల్లాల రాజయ్య, రైతు, నెహ్రూనగర్, ఇల్లెందు మండలం
కేసీఆర్ సారు ఈ ప్రాంత రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తలపెట్టిన ‘సీతారామ’ ఎత్తిపోతల పథకంతో మా భూములకు సాగునీరు వస్తాయని ఎదురుచూస్తున్నాం. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సీతారామ నీటిని భద్రాద్రి జిల్లాకు రాకుండా చేస్తున్నది. నీటిని తరలించుకుపోతుంటే చాలా బాధగా ఉంది. కాలువల కోసం మా భూమిని, ఇక్కడి నీటిని తీసుకొని పక్క జిల్లాకు తరలిస్తుంటే ఎవరూ పట్టించుకోవడం లేదు.
– బొమ్మెర్ల వరప్రసాద్, రైతు, బొమ్మనపల్లి, టేకులపల్లి మండలం