పర్ణశాల/ మణుగూరు టౌన్, నవంబర్ 24: రూ.కోట్ల ఆర్జన కోసం ఇసుకాసురులు ఇసుక దోపిడీకి పాల్పడుతూ ఏజెన్సీ రహదారులను ధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు మండిపడ్డారు. ఆ రహదారుల్లో ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా కాంగ్రెస్ పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ‘ఇసుక లారీల దిగ్బంధం’లో భాగంగా దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద ప్రధాన రహదారిపై సోమవారం నిర్వహించిన రాస్తారోకోలో రేగా మాట్లాడారు.
దుమ్ముధూళితో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నా, రహదారులు ధ్వంసమై ప్రమాదాలు జరిగి ఎంతోమంది మృత్యువాత పడుతున్నా ఉమ్మడి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే కనీసం పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. ఇసుక లారీలను కట్టడి చేసేవరకు, ప్రధాన రహదారిని మరమ్మతులు చేసేవరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ నాయకులు మానె రామకృష్ణ, సాగి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదకరంగా మారిన గుంతల రోడ్లను మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మణుగూరు సీఎస్పీ ప్రధాన రహదారిపై కూడా నాయకులు సోమవారం బైఠాయించి నిరసన తెలిపారు.