రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మొత్తానికే కోతలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు కర్షకుల్లో కలవరం మొదలైంది. పంటలు వేసిన రైతులకే రైతుభరోసా అంటూ పాలన చేపట్టిన మొదట్లోనే మొదలుపెట్టిన కాంగ్రెస్ పాలకులు.. తరువాత ఒక్కో నిబంధనను తెరమీదకు తెస్తూ వచ్చారు. అభిప్రాయ సేకరణలో రైతుల సూచనలనే పరిగణనలోకి తీసుకున్నామని చెబుతూ రైతుల నెత్తిన వారి చేయినే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా రైతుభరోసాకు ఎగనామం పెట్టేందుకు కుట్ర పన్నుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి తరువాత రైతుభరోసా జమ చేస్తామంటూ కొన్ని నెలలుగా మంత్రులు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తీరా సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో మరికొన్ని నిబంధనలంటూ లీకులు చేస్తున్నారు. ఇక నుంచి ఏ సీజన్‌కు ఆ సీజన్ చొప్పున రైతుల నుంచి స్వీయ ధ్రువీకరణ ప్రతాలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో నిజంగా పంట వేసిన రైతులకే రైతుభరోసా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ఆలోచనలనే అమలుచేస్తే పేద రైతులు పెద్ద సంఖ్యలో నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది.
-భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 2 (నమస్తే తెలంగాణ)
అధికారం కోసం అన్నదాతలను అడుగడుగునా మభ్యపెట్టింది కాంగ్రెస్. తీరా అధికారంలోకి వచ్చాక తన కోతల ప్రతాపాన్ని కర్షకులపై చూపిస్తోంది. ఎకరానికి రూ.10 వేల చొప్పున మొన్నటి వరకూ నిరాటంకంగా రైతుబంధును అందిస్తూ వచ్చిన గత కేసీఆర్ ప్రభుత్వంపై లేని పోని ఆరోపణలు చేసింది కాంగ్రెస్. పైగా తాము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ సర్కారు ఇస్తున్నట్లుగా రూ.10 వేలు కాకుండా.. రూ.15 వేలు ఇస్తామంటూ నమ్మబలికింది. దీంతో అన్నదాతలు ఆదరించారు. కానీ.. తీరా అధికారంలోకి వచ్చాక వారినే నట్టేట ముంచాలని చూస్తోంది కాంగ్రెస్. అధికారం చేపట్టి ఏడాది దాటిపోయినా ఇప్పటికే రెండు సీజన్ల రైతుభరోసాకు ఎగనామం పెట్టింది.
మరోవైపు రుణమాఫీ విషయంలోనూ మొండిచేయి చూపింది. అధిక శాతం మంది అర్హులైన రైతులకు రుణమాఫీని వర్తింపజేయలేదు. అనేక నిబంధనలు పెడుతూ అర్హులకు చోటులేకుండా చేసింది. ఇక రూ.2 లక్షలకుపైగా ఉన్న రుణాలున్న రైతులను పూర్తిగా పక్కన పెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులందరూ ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. రుణమాఫీ కాని రైతులందరూ సొసైటీల దగ్గర, బ్యాంకుల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఒకవైపు రైతుభరోసా ఇవ్వక, మరోవైపు రుణమాఫీ చేయక, ఇంకోవైపు బ్యాంకుల చుట్టూ తిరిగినందుకు పంటలు చేతికి రాక అన్ని విధాలా నష్టపోయిన అన్నదాతలు.. కాంగ్రెస్ సర్కారుపై కోపంతో ఉన్నారు. ఇదే సమయంలో సెల్ఫ్ డిక్లరేషన్ల పేరుతో రైతులపై పిడుగులు పడేసేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కుటుంబం యూనిట్..
గత కేసీఆర్ ప్రభుత్వం రైతును యూనిట్‌గా తీసుకొని ప్రతి రైతుకూ రైతుబంధును అందించింది. కానీ.. ఏడాది క్రితం వచ్చిన కాంగ్రెస్ సర్కారు రైతు కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుంటోంది. గత ప్రభుత్వం ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతుబంధు అందించింది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు పెడుతూ ఏడు ఎకరాలుగా సీలింగ్ విధించే ప్రయత్నంలో ఉంది. దీంతో ఒకవేళ ఒక కుటుంబంలో భార్యాభర్తల పేరిట చెరో ఏడు ఎకరాల సాగు భూమి ఉన్నా ఇద్దరికీ కలిపి ఏడు ఎకరాల వరకే రైతుభరోసా అందించనుంది. అందులోనూ పంటలు సాగు చేస్తున్న భూములకే పంటల పెట్టుబడి సాయం అంటూ మెలిక పెడుతుండడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
జిల్లాలో 1,33,396 మంది రైతులు..
జిల్లాలో 1,33,396 మంది రైతులున్నారు. ఏటా రెండు సీజన్లలో పంటలు సాగు చేస్తున్నారు. మొత్తంగా 4,50,800 ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు. ఇందులో పోడు రైతులు కూడా జొన్నలు, నువ్వులు పండిస్తున్నారు. వీరికి కూడా గత కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు అందించింది. రైతుబీమా అమలు చేసింది. కానీ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏరివేతల యత్నాల్లో జిల్లా రైతుల్లో ఎంతమంది రైతుభరోసాకు అర్హులవుతారన్న ప్రశ్న తలెత్తుతోంది.
రెండు పంటలకు రైతుభరోసా ఇవ్వలేదు..
గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు తప్పితే ఇంత వరకూ పంటల పెట్టుబడి సాయం అందలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు పంటలకు రావాల్సిన రైతుభరోసా రానేలేదు. పైగా రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరగడమే పనిగా పెట్టుకోవాల్సి వచ్చింది. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్లు అందరికీ రైతుభరోసా ఇవ్వాలి.
-సత్తి నాగేశ్వరరావు, రేపల్లెవాడ, చండ్రుగొండ
నిబంధనలు లేకుండా రైతుభరోసా అందించాలి..
పంటలు వేయాలంటే పెట్టుబడి ఉండాలి. గడిచిన రెండు పంటలకు రైతుభరోసా రాలేదు. బయట అప్పులు తెచ్చాం. తుపాను వల్ల పంటలు దెబ్బతిన్నాయి. వడ్లు ఆరబోస్తే వర్షానికి తడిసి ముద్దవుతున్నాయి. ఇన్ని కష్టాల్లో మాకు రైతుభరోసా కూడా ఇవ్వట్లేదు. ఇకముందైనా నిబంధనలు లేకుండా రైతు భరోసా ఇవ్వాలి.
-గాలం రవి, రైతు, రావికంపాడు, చండ్రుగొండ
విధివిధానాలు ఇంకా రాలేదు..
రైతుభరోసా విధివిధానాలు సంక్రాంతి నాటికి ఇచ్చే అవకాశాలున్నాయి. అర్హులకు మాత్రమే రైతుభరోసా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెడుతుందో తెలియదు. మార్గదర్శకాలు ఇంకా మాకు రాలేదు. వీసీ ద్వారా మాకు ప్రభుత్వం నుంచి సూచనలు చేస్తారు. ప్రస్తుతం సన్న వడ్లుకు బోనస్ వస్తోంది.
-బాబూరావు, డీఏవో, భద్రాద్రి