Rega Kantha Rao | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలను ఇక మీదట నమ్మే పరిస్థితి లేదని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేశాయని బీఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు రేగ కాంతారావు ఎద్దేవా చేసారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణ పాఠం చెప్పారన్నారు. శనివారం వెల్లడైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీట్లు గెలవడం పక్కన పెడితే, కనీసం ఒక్క సీట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి రాలేదన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభావంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా వచ్చిందని బీఆర్ఎస్ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఎద్దేవా చేశారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను ఢిల్లీ ప్రజలు అసలు పరిగణనలోకి కూడా తీసుకోలేదని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయని రేగా కాంతారావు చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మరి ప్రచారం చేశాడని, తెలంగాణలో అమలు చేస్తున్నట్లే కాంగ్రెస్ ఢిల్లీలో గెలవగానే ఎన్నికల్లో ఇచ్చిన అని హామీలను అమలు చేస్తామని బీరాలు పలకడం కొసమెరుపని విమర్శించారు.
కానీ సీఎం రేవంత్రెడ్డి హామీలను ఢిల్లీ ప్రజలు లైట్ తీసుకున్నారని రేగా కాంతారావు తెలిపారు. మహారాష్ట్రలో రేవంత్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో మాదిరిగానే ఢిల్లీలోనూ ఓటమి పాలైందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బలమైన ప్రాంతీయ పార్టీలను ఓడించడానికి బద్ధ శత్రువులైన కాంగ్రెస్, బీజేపీలు కలిసి పని చేయడానికి కూడా వెనుకాడవని మరోసారి ప్రజలకు అర్థమైందన్నారు..