ఖమ్మం/ ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 25: మొన్న మానుకోటలో, నేడు ఖమ్మంలో నిరుద్యోగ యువత ఆవేదన, ఆక్రందన చూస్తుంటే త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగం (పదవి) పోవడం కూడా ఖాయంగా కన్పిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో సుమారు వెయ్యిమంది నిరుద్యోగ యువతీ యువకులు గురువారం కదం తొక్కారు. మయూరిసెంటర్ నుంచి జడ్పీ సెంటర్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం జడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. నిరుద్యోగుల ఆందోళనకు రాకేశ్‌రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. యూత్ డిక్లరేషన్‌ను అమలుచేయాలని, రెండు లక్షలకు ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కానీ అసలైన ఓట్ల చోరీ తెలంగాణలోనే జరిగిందని, అదే నిరుద్యోగుల ఓట్ల చోరీ అని, గ్రూప్ -1 ఉద్యోగాల చోరీ అని విమర్శించారు.
నిరుద్యోగులను ఓడించేందుకు కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం లాయర్లకు ఖర్చు చేస్తోందని ధ్వజమెత్తారు. మొదటిసారి తెలంగాణ ఉద్యమం కూడా నిరుద్యోగ యువత నుంచే ప్రారంభమైందని, అది కూడా ఖమ్మం నుంచే మొదలైందని గుర్తుచేశారు. పదేళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ నేతలు.. కేవలం తాము అధికారంలోకి రావడం కోసమే గత ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలిచ్చారని విమర్శించారు.
అధికారం చేతికొచ్చి వారికి ఉద్యోగాలు (పదవులు) రాగానే నిరుద్యోగులను మరిచిపోయారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ప్రచార సామగ్రిని వాడుకొని వదిలేసినట్లుగా నిరుద్యోగులను కూడా వాడుకొని వదిలేశారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రశాంత్, రాజేశ్, అనిల్, రాజు పాల్గొన్నారు.