టేకులపల్లి, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ మండిపడ్డారు. మండలంలోని కిష్టారం, గంగారం, సంపత్‌నగర్, కొప్పురాయి గ్రామాల్లో గురువారం పర్యటించిన ఆమె.. కార్యకర్తలతో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు.
ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ పాలనలో గ్రామపంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేవారు కరువయ్యారన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించారని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రైతులు యూరియా కోసం నానా తంటాలు పడుతున్నారని అన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి.. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశాల్లో బీఆర్ఎస్ టేకులపల్లి మండల అధ్యక్షుడు బొమ్మెర వరప్రసాద్, నాయకులు బానోతు కిషన్, బానోతు రామానాయక్, భూక్యా బాలకృష్ణ, లావుడ్యా హనుమంతు, ఇస్లావత్ బాలు, జేబ్బ విజయలక్ష్మి, చింత వెంకన్న, ప్రసాద్ పాల్గొన్నారు.