రఘునాథపాలెం, జూన్ 12 : ప్రజాస్వామ్యంలో ప్రాథమికమైనది ఓటు హక్కు. ఓ ఓటరు తన పాలకుడిగా ఎవరిని ఎంచుకోవాలన్నది కేవలం అతడి అభీష్టం. అంతటి స్వేచ్ఛను కల్పించిన గొప్పదనం మన రాజ్యాంగానిది. అలాగే, రాజకీయ పార్టీలను ఎంచుకోవడంలోనూ, వాటిని అభిమానించడంలోనూ, వాటిల్లో కొనసాగడంలోనూ, కొనసాగకపోవడంలోనూ పూర్తి స్వేచ్ఛ ప్రజలది, ఓటర్లదే. అలాగే, ప్రజాతీర్పును, ప్రజాభిప్రాయాన్ని ఆమోదించడం, గౌరవించడం ఆయా పార్టీల విధి. అధిక శాతం మంది ప్రజలు తమకు అందించిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలందరికీ (ఆ పార్టీకి ఓటు వేసిన వారికి, ఆ పార్టీకి ఓటు వేయని వారికి) నిస్పక్షపాత పాలన అందించాలి. కానీ.. తెలంగాణలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీరు అలా లేదు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఆ పార్టీ నాయకుల తీరు అసలే లేదు.
మా పార్టీలోకి రావాల్సిందే..
‘అధికారం మాది. పెత్తనం మాది. ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నవాళ్లయినా సరే.. ఇప్పుడు మర్యాదగా మా పార్టీలోకి మారాలి. లేకుంటే మామూలుగా ఉండదు. అవసరమైతే ప్రభుత్వ పింఛన్ పీకేస్తాం’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు రఘునాథపాలెం మండలంలోని కోయచలక గ్రామ కాంగ్రెస్ నాయకులు. వీరి వేధింపులతో ఇప్పటికే చాలామంది ప్రజలు తమ పార్టీలపై ఉన్న అభీష్టాలను కూడా మార్చుకుంటున్నారు. ఇంకొందరు గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ‘రాష్ట్రంలో మేమే అధికారంలో ఉన్నాం. అందుకని మేం చెప్పినట్లే వినాలి. మేం చెప్పిందే చేయాలి.’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వేధింపులతో ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారులను తమ పార్టీలోకి రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరి హూంకరింపులతో వణికిపోతున్న కొందరు ప్రజలు, లబ్ధిదారులు ఇప్పటికీ ఆ పార్టీ కండువాలు కప్పుకున్నట్లు తెలిసింది.
పింఛన్ లబ్ధిదారులే టార్గెట్గా..
ముఖ్యంగా ఇక్కడి కాంగ్రెస్ నాయకులు.. ఆసరా పింఛన్ లబ్ధిదారులను టార్గెట్ చేసుకున్నారు. పింఛన్ తొలగిస్తామన్న అస్త్రంతో లబ్ధిదారులను వారి పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులు కొందరు ఆరోపిస్తున్నారు. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామస్థాయిలో ఇప్పటికే బలంగా ఉన్న బీఆర్ఎస్ను ఖాళీ చేయాలని కాంగ్రెస్ నాయకులు కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తోంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఇతర వృత్తిదారులకు.. గడిచిన పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం పెంచి అందించిన ఆసరా పింఛన్లు ఎంతో అక్కరకొస్తున్నాయి. దీంతో వారంతా ఉద్యమనేతకు ఆసరాగా, అండగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి మనసులను, ఓట్లను అభిమానంతో గెలుచుకోలేక.. భయంతో లాక్కోవాలని చూస్తున్నారు. ప్రతి నెలా ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లను లబ్ధిదారుల అర్హతా ప్రమాణాలతో కాకుండా.. తమ పార్టీలో చేరారా? లేదా? అనే ప్రాతిపదికన ఇచ్చేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. పైగా ‘పింఛన్ రావాలంటే.. మా మూడు రంగుల జెండా కప్పుకోవాల్సిందే’ అంటూ హుకుం జారీ చేస్తుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు మంచి పనులతో ప్రజల మనసులు గెలుచుకోకుండా.. ఇలా భయబ్రాంతులతో బలవంతంగా పార్టీలో చేర్చుకోవడం ఏంటని గ్రామస్తులు కొందరు మండిపడుతున్నారు.