నమస్తే నెట్వర్క్: ‘ధరణి’ వచ్చాకే కొత్త పట్టాలు వచ్చాయ్.. రైతుబంధు వస్తున్నది.. రైతుబీమా అండగా ఉంది. రుణ సౌకర్యం సులువైంది. భూముల ధరలూ పెరిగినయ్.. భూమిని అమ్మాలన్నా, కొనాలన్నా ఇబ్బందులు తొలిగిపోయినయ్.. పైరవీలు లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.. భూ సమస్యలు కనుమరుగయ్యాయి. దీంతో రైతులందరూ సంతోషంగా ఉన్నారు.. అయితే కాంగ్రెస్ నాయకులకు ఇవేమీ కనిపించడం లేదు.. రైతులు ఆనందంగా ఉండడం వారికి ఇష్టం లేనట్లుగా ఉన్నది.. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామంటూ పిచ్చికూతలు కూస్తున్నారు. మళ్లీ దళారులను రైతులపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. ధరణిని రద్దు చేసి పాతపద్ధతిని తీసుకొచ్చి రైతులను బాధ పెట్టాలని చూస్తున్నారు. ఇదంతా చూస్తున్న రైతన్నలు కాంగ్రెస్ పార్టీపై భగ్గుమంటున్నారు. కష్టాలన్నీ పోయి సంతోషంగా సాగుతున్న తమ జీవితాలను మళ్లీ పాత ఊబిలోకి నెట్టాలని చూస్తున్న దగుల్బాజీ నాయకులకు బుద్ధి చెబుతామంటూ మండిపడుతున్నారు.
ఒకప్పుడు ఒక రైతు రెవెన్యూ కార్యాలయంలో పని చేయించుకోవాలంటే ఆఫీస్ చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందే.. అది పహానీ అయినా.. రిజిస్ట్రేషన్ అయినా..! అంతేనా అంతో ఇంతో ‘అమ్యామ్యా’ ముట్టజెప్పాల్సిందే.. ఒక్క ‘ధరణి’తో భూరిజిస్ట్రేషన్లలో పారదర్శకత వచ్చింది.. భూ రికార్డులన్నీ డిజిటలైజ్ అయ్యాయి.. దళారులు, పైరవీకారుల అక్రమాలకు చెక్‌పడింది.. అవినీతికి అడ్డుకట్ట పడింది.. భూమి విషయంలో అన్నదమ్ముల కొట్లాటలకు తావే లేదు.. తాము అధికారంలోకి వస్తే ఇంత మంచి పోర్టల్‌ను తీసేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు కారు కూతలు కూస్తున్నారు.. దీనిపై రైతాంగం గళం విప్పుతున్నారు.. పోర్టల్‌తో అన్ని విధాలా లాభమే గానీ నష్టమేమీ లేదని ఘంటాపథంగా వెల్లడిస్తున్నారు. – నమస్తే నెట్వర్క్
ధరణిని రద్దు చేస్తే పథకాలన్నీ పోయినట్లే..
ధరణిని రద్దు చేస్తే వ్యవసాయ ఆధారంగా ఇస్తున్న పథకాలు అన్నీ కూడా రైద్దెపోతాయి. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలకు ఆధారం ధరణినే. రైతు చనిపోయిన 10 నుంచి 15 రోజుల్లోనే రైతుబీమా సొమ్ము నామినీ అకౌంట్లో పడుతున్నది. గతంలో రైతు చనిపోతే ఆపద్బంధువు పథకం కింద రూ.50 వేలు ఇచ్చేవారు.. ఆ డబ్బు వచ్చేసరికి సంవత్సరాలు పట్టేవి. అవీ పైరవీ చేసుకోగలిగిన వారికి మాత్రమే వచ్చేవి. కలెక్టర్ నుంచి రావాల్సి ఉండడంతో ఎంతో ఆలస్యమయ్యేది అధికారులకు ఎంతోకొంత ముట్టజెప్పాల్సిందే. నేడు చనిపోయిన రైతు కుంటుంబానికి ఎలాంటి పైరవీలేకుండా సాయం అందుతుందంటే అది కేవలం ధరణి వల్లనే సాధ్యమైంది. ధరణి పోర్టల్‌లో ఉన్న సమగ్ర సమాచారంతోనే రైతుబంధు డబ్బులు అందుతున్నాయి. ధరణిని రద్దు చేస్తే సమాచారం ఎక్కడి నుంచి తీసుకుంటారు.. ఎవరికి లబ్ధి చేకూర్చుతారు. సబ్సిడీ ఎరువులు, విత్తనాలు ధరణి ద్వారానే అందిస్తున్నారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామనే వారు దేనిఆధారంగా ఈ పథకాలను అందిస్తారో కూడా చెప్పాలి. ధరణిని రద్దు చేసి సమాచారం లేదని పథకాలన్నింటినీ కూడా బంద్ పెడతారు. రైతులు బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా ధరణి పోర్టలే ఆధారం.
గతంలో లోన్ తీసుకోవాలంటే సంవత్సరాలు పట్టేది నేడు గంటల వ్యవధిలోనే లోన్ వస్తున్నది. ఒకటి ఉందీ ఒకటి లేదు అని లేకుండా సర్వం ధరణి పోర్టల్‌లో నిక్షిప్తమై ఉంది. గత ప్రభుత్వాల హయాంలో రైతులకు ఏదైనా పథకం ప్రకటిస్తే దానికోసం సవాలక్ష పత్రాలు ఇవ్వాల్సి వచ్చేది. రైతు తన పొలం అని నిరూపించుకోవడానికి నానాపాట్లు పడాల్సి వచ్చేది. కానీ నేడు ప్రభుత్వం పంట నష్టపరిహారం ప్రకటిస్తే అధికారులే పొలం వద్దకు వచ్చి పంట నష్టపరిహారం నమోదు చేశారు. పట్టాపాస్ పుస్తకం ద్వారా ధరణిలో పరిశీలించి వివరాలు నమోదు చేశారు. గతంలో ఎన్నడూ ఇలాంటిది చూడలేదు. ధరణి వల్ల నేడు పైరవీకారులకు పనిలేకుండా పోయింది. గత ప్రభుత్వాల హయాంలో ఏ పని చేయాలన్నా పైరవీకారుల నుంచి అధికారుల వరకూ ముట్టజెప్పాల్సి వచ్చేది. కానీ నేడు ఆన్లైన్లోనే అన్ని పనులు అవుతున్నాయి. ఒకవేళ ధరణి రద్దు అయితే ఈ పథకాలన్నీ పోయినట్లే.
– వాచేపల్లి లక్ష్మారెడ్డి, రైతు, గంధసిరి, ముదిగొండ
రైతులు సంతోషంగా ఉండడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు..
తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు మాలాంటి రైతులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. రైతులు సంతోషంగా ఉండడం కాంగ్రెస్‌కు ఇష్టం లేనట్లుగా కన్పిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భూముల సమస్యల పరిష్కారం కోసం, పట్టాదారు పాస్ పుస్తకాల కోసం, రిజిస్ట్రేషన్ల కోసం కాళ్లరిగేలా ఎలా తిరిగేవాళ్లమో రైతులందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్ వచ్చాక రిజిస్ట్రేషన్ల సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి. కేవలం మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లోనే పనులు జరుగుతున్నాయి. నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్లు పూర్తయి హక్కు పత్రాలు చేతికొస్తున్నాయి. ఇంతటి వేగవంతమైన సేవలను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తోంది. అయినా రైతులందరూ ఈ అబద్ధపు ప్రచారాలను గమనిస్తూనే ఉన్నారు.
– పోట్ల ప్రసాద్, రైతు, ముదిగొండ, ఖమ్మం జిల్లా
కాంగ్రెస్ నాయకులవి పనికిమాలిన మాటలు..
గతంలో భూమిని కొనుగోలు చేస్తే దాన్ని పాసుబుక్ చేయించుకు నేందుకు నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయం, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో ఇప్పుడు భూమిని కొనుక్కోవడం సులువుగా మారింది. మేము ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న రెండ్రోజులకే రిజిస్ట్రేషన్ తేదీని ఇచ్చారు. మాకు ఇచ్చిన తేదీ ప్రకారం మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాం. నా పేరు మీదకు భూమిని పది నిమిషాల్లో మార్పిడి చేసి అధికారులు భూమికి సంబంధించిన పత్రాలను అందించారు. గతంలో డబ్బులు ఇచ్చినా తొందరగా పనులు జరిగేవి కావు, ఇప్పుడు మధ్యవర్తులు లేకుండా, ఎక్కడా రూపాయి ఇవ్వకుండా నిమిషాల్లో పని ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. కాంగ్రెస్ నాయకులు ధరణిని రద్దు చేస్తామంటూ పనికిమాలిన మాటలు చెబుతున్నారు.. రైతులను నట్టేట ముంచేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. రైతులందరూ జాగ్రత్తగా ఉండాలి.
–యర్రా ఉష, భూమి కొనుగోలుదారురాలు, నేలకొండపల్లి
ధరణిపై కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం
ధరణి పోర్టల్ రాకముందు నాకు వారసత్వంగా వచ్చే ఐదెకరాల భూమి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డాను. నా తండ్రి ఆ భూమిని నాకు ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ పట్టా చేయడానికి అధికారులు ససేమిరా అన్నారు. కాళ్లరిగేలా తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగాను. అప్పటి వీఆర్వో నీకు పాస్‌బుక్ రాదని హేళన చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టారు. దీంతో మా నాన్నను, పట్టా భూమికి సంబంధించిన పత్రాలను తీసుకుని తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాను. వారు పరిశీలించి ఐదెకరాల భూమిని నా పేరు మీద పట్టా చేసి పాస్‌పుస్తకం ఇంటికే పంపించారు. ధరణి రావడంతో నా కల నెరవేరింది. అంతేకాదు ఆన్లైన్లో భూ రికార్డులు భద్రంగా ఉన్నాయనే భరోసా కలిగింది. కాంగ్రెస్ నాయకులు ధరణి పోర్టల్ విషయంలో అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. రైతులెవ్వరూ నమ్మొద్దు.
– ఏనుగుల సురేష్, రైతు, టేకులచెరువు, బూర్గంపహాడ్ మండలం
ధరణితోనే మాకు ధైర్యం
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల మేలు కోసం ధరణి పోర్టల్‌ను ఏర్పాటు చేయడం మాకేంతో ధైర్యం. ఒక సారి ధరణిలో భూమి ఎక్కితే మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పట్టాదారు ఒప్పుకుంటేనే పట్టా మార్పిడి అవుతుంది తప్ప దానిని మార్చడం ఎవరి వల్లా సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రంలో తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తేనే రైతులకు మేలు. కాంగ్రెస్ వస్తే ధరణి పోర్టల్‌ను ఎత్తివేస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రెవెన్యూ అధికారులు రికార్డులు మార్చడానికి వీలు లేకుండా పోయింది. ధరణిలో మన భూమికి ఆధార్‌కార్డు లింక్ చేయడం వల్ల మరింత పారదర్శకమైంది.
– యర్రా రమేష్, రైతు, లింగపాలెం, వేంసూరు మండలం
ధరణి రైతుల పాలిట కల్పతరువు
ఇల్లెందు రూరల్ ధరణి రైతుల పాలిట కల్పతరువులా మారింది. ఎన్నో ఏళ్ళుగా రైతుల పేరిట ఎంత జాగా ఉందో తెలుసుకోవడానికి అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌తో ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సెల్ఫోన్లో ఒక్క బటన్ నొక్కితే చాలు మన భూమి వివరాలు తెలుస్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని ప్రకటన చేస్తుంది. దీంతో రైతుల భవిష్యత్తు అంధకారంలో నెట్టినట్లవుతుంది. పాత రోజులు మళ్ళీ పునరావృతమవుతాయి. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. భూమి వివరాలు తెలుసుకోవాలంటే నరకయాతన పడాలి.
– పెరుమాళ్ళ కృష్ణయ్య, రైతు, ముకుందాపురం, చల్లసముద్రం పంచాయతీ, ఇల్లెందు
ధరణిని తీసివేయొద్దు..
మాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. గతంలో మా భూమికి పట్టాలేదు. ధరణి వచ్చాక పట్టా పాసుపుస్తకంతోపాటు రైతుబంధు కింద సంవత్సరానికి రూ.40 వేలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వమే రైతుబీమా కల్పించింది. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామంటున్నారు. అదే జరిగితే మాకు భరోసా పోతుంది. గతంలో పట్టా లేకుండా ఎటువంటి పంట సహాయంగానీ, బీమాగానీ ప్రభుత్వా లు ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే ఈ భరోసాను కల్పించింది. ధరణిని ఉంచాలి.. తీసివేయవద్దు..
– ముగితె విజయలక్ష్మి, పెనగడప గ్రామం, చంచుపల్లి మండలం