భద్రాచలం, జూలై 5 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజురోజుకూ ముదురుతోంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య అనుచరులు బాహాటంగా విమర్శలు గుప్పించుకునే స్థాయికి చేరింది. పొదెం అభిమానిపై ఎమ్మెల్యే వర్గానికి చెందిన నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. భద్రాద్రి జిల్లాలోని దుమ్ముగూడెం మండల కేంద్రమైన లక్ష్మీపురంలో గురువారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య ఘాటైన విమర్శలు చేశారు. ‘భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నిజమైన కార్యకర్తలకు అందనీయకుండా చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, ఇతర ప్రభుత్వ పథకాలను నిజమైన కార్యకర్తలకు అందనీయకుండా ఎమ్మెల్యే వర్గానికి చెందిన నాయకులు సైతం దూరం చేస్తున్నారు. పార్టీలో వారి పెత్తనమే సాగాలంటూ ఆంక్షలు విధిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రవర్తనతో పార్టీకే కాకుండా ప్రజల విశ్వాసానికి కూడా భంగం వాటిల్లుతుందని వీరయ్య విమర్శించారు. అయితే దీనికి కౌంటర్‌గా సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే వెంకట్రావు అభిమాని ‘మీరే గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు.
హైకమాండ్ అంతా చూస్తోంది. ఇప్పటికైనా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీ, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలి’ అంటూ శనివారం పోస్టు పెట్టాడు. దీనిపై స్పందించిన పొదెం వీరయ్య అభిమాని సదరు వ్యక్తికి ఫోన్ చేసి.. ‘నువ్వు చేసిన వ్యాఖ్యలు సరికాదు. మా అభిమాన నాయకుడు పొదెంపై విమర్శలు చేస్తే సహించేది లేదు. నువ్వెక్కడున్నావో చెప్పు నేను అక్కడికి వస్తాను’ అంటూ సవాల్ విసిరాడు. దీంతో ఎమ్మెల్యే అభిమాని బస్టాండ్ ఏరియాలోని హోటల్ వద్ద ఉన్నానని చెప్పడంతో అక్కడికి వెళ్లిన వీరయ్య అభిమాని అతడితో వాగ్వాదానికి దిగాడు. వీరి మధ్య గొడవ జరగడంతోపాటు కొట్టుకునే స్థాయికి చేరింది.
ఈ క్రమంలో అటుగా వెళ్తున్న పొదెం వీరయ్య వర్గానికి చెందిన మరో కీలక నేత జోక్యం చేసుకుంటూ.. ఇప్పటికే పార్టీ పరువుపోతోంది.. ఇంకా మీరు గొడవలతో పరువు తీయొద్దని వారించి సద్దుమణిగేలా చేశారు. ఈ ఘటన భద్రాద్రి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే వర్గానికి చెందిన వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పొదెం వర్గానికి చెందిన వ్యక్తిపై శనివారం సాయంత్రం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇరువర్గాల పరస్పర ఆరోపణలు ఎటు దారి తీస్తాయో.. పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. అయితే ఇప్పుడే ఇలా ఉంటే.. భవిష్యత్‌లో పరిస్థితి ఎలా ఉంటుందోనని పార్టీలోని నాయకులే బాహాటంగా చర్చించుకుంటున్నారు.