ఖమ్మం రూరల్: గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం తెల్లవారేసరికి చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఖమ్మం (Khammam) జిల్లా పాలేరు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు (Congress Leaders) ఓటమిని తట్టుకోలేక తమ అక్కసును ఓటర్లపై చూపుతున్నారు. రెండో విడత ఎన్నికలు ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు అనంతరం ఖమ్మం రూరల్ మండలం తీర్థల గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి భూక్యా శైలజ.. కాంగ్రెస్ అభ్యర్థి భూక్య ప్రమీలపై భారీ విజయంతో గెలుపొందారు. దీనిని జీర్ణించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు కోసం డబ్బులు ఇచ్చామని, ఓడిపోయాం కాబట్టి తిరిగి తమ డబ్బులు ఇవ్వాలని సోమవారం ఉదయం ఇంటింటికి వెళ్లి అడుగుతున్నారు. మీ ఓట్లు తమకు పడలేదని, డబ్బు తిరిగి ఇవ్వాలని అడగడంతో తీర్థాల గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
మా ఇంటికి వచ్చి పది రోజుల పాటు ప్రలోభాలు పెట్టారని, ఎన్నికల్లో తమకు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేశామని గ్రామస్థులు అంటున్నారు. తమ ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తున్నారంటూ ప్రజలు కాంగ్రెస్ నాయకులపై తిరగబడ్డారు. కాంగ్రెస్ నాయకులు పైసలు వసూలు చేసే కార్యక్రమం చేపట్టడంతో ఖమ్మం రూరల్ మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.