ఖమ్మం సిటీ/ మణుగూరు టౌన్, ఏప్రిల్ 22: తెలంగాణ రాష్ర్టానికి కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే జీవనాధారమని బీఆర్ఎస్ ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు తాతా మధు, రేగా కాంతారావు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు చేసుకున్నాయి. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయం (తెలంగాణ భవన్) ఎదుట సంబురాల అనంతరం మీడియా సమావేశంలో తాతా మధు మాట్లాడారు.
కాళేశ్వరం కూలిందంటూ, లక్ష కోట్ల అవినీతంటూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరించారని మండిపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తికి వారు విరుద్ధంగా వ్యవహరించారని, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా విచారణ పేరుతో పీసీ ఘోష్ కమిషన్ వేశారని, చివరికి హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అంతా బూటకమని తేలిపోయిందని అన్నారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌రెడ్డి సర్కారుకు, ఇందిరమ్మ రాజ్యానికి చెంపపెట్టు లాంటిదని తాతా మధు స్పష్టంచేశారు. రాష్ట్రంలో అత్యంత నిరంకుశంగా పాలన చేస్తున్న రేవంత్ సర్కారుకు ఇది చెప్పుదెబ్బ లాంటిదన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ, చరిష్మాను చెరిపేయాలనే కుట్రతో కాంగ్రెస్ నేతలు కాళేశ్వరాన్ని ఒక ఎజెండాగా ఎంచుకున్నారని ధ్వజమెత్తారు. చివరికి కమిషన్ దర్యాప్తు విధానాన్ని న్యాయస్థానం తప్పు పట్టడంతో ఉద్యమనేతను బద్నాం చేయాలన్న వారి దురుద్దేశం తేటతెల్లం అయ్యిందన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కరువుచాయలు అలుముకుంటున్న నేపథ్యంలో బుద్ధి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డను రిపేరు చేయాలని హడావిడిగా ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. వీటన్నింటినీ తెలంగాణ సమాజం గమనిస్తోందని, త్వరలోనే వారికి గట్టి బుద్ధి చెప్పేందుకు సన్నద్ధమవుతోందన్నారు. ఈ సంబురాల్లో బీఆర్ఎస్ నేతలు సండ్ర వెంకటవీరయ్య, ఖమర్, ఆర్జేసీ కృష్ణ, బచ్చు విజయ్‌కుమార్, పగడాల నాగరాజు, ఉప్పల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

06
భద్రాద్రి జిల్లా మణుగూరులో జరిగిన సంబురాల్లో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ పెట్టిన తప్పుడు కేసులను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ అబద్దాల రాజకీయాలకు గట్టి చెంపపెట్టు అని, రాజకీయ కక్షతో తెలంగాణ అభివృద్ధి చిహ్నాలపై బురదజల్లే ప్రయత్నాలు న్యాయస్థానం ఎదుట నిలువవని ఈ తీర్పు స్పష్టం చేసిందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, నిజానికి దక్కిన విజయంగా అభివర్ణిస్తూ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి ప్రతీకార రాజకీయాలు చేయడం మానుకోవాలని హితువు పలికారు. సంబురాల్లో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావులపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక సరికాదని హైకోర్టు తీర్పు ద్వారా తేల్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టు. పదేళ్లు పాలించిన కేసీఆర్‌పై లేనిపోని, పసలేని ఆరోపణలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజాదరణ కలిగిన నాయకుడి పక్షానే ప్రజలు ఉంటారనేది స్పష్టమైంది.
-సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ సాధకుడు కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎన్ని ఆరోపణలు చేసినా అవి పసలేనివని హైకోర్టు తీర్పుతో నిరూపణ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసి, బురద జల్లాలని చూస్తే దానిని హైకోర్టు తప్పు పట్టిందనేది స్పష్టమైంది. నిజం నిప్పు లాంటిదని రుజువైంది.
-వనమా వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి
కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నాం. కమిషన్ విచారణ సందర్భంగా ప్రాథమిక న్యాయ సూత్రాలు, నిబంధనలు పాటించలేదని కోర్టు తీర్పులో పేర్కొంది. ఇక ఆ నివేదికకు చట్టబద్ధత లేదనే విషయం తేటతెల్లమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్; మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్‌రావులపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చే దురుద్దేశంతో ప్రభుత్వం కమిషన్లను అడ్డం పెట్టుకొని వేధింపులకు పాల్పడుతోంది.
-వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
కాళేశ్వరం పథకానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నాం. కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడం అభినందనీయం. విచారణ సందర్భంగా కమిషన్ ప్రాథమిక న్యాయసూత్రాలు, నిబంధనలు పాటించలేదని తీర్పులో పేర్కొనడం నివేదికకు చట్టబద్ధత లేదనేది తేటతెల్లమైంది.
– పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి
రాష్ట్ర సాధకుడు కేసీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌లపై ఒత్తిడి తెచ్చే దురుద్దేశంతో కమిషన్‌ను అడ్డం పెట్టుకుని వేధింపులకు పాల్పడడం తీవ్ర అభ్యంతరకరమని హైకోర్టు తీర్పు చెప్పడం కాంగ్రెస్‌కు చెంప పెట్టు. తెలంగాణ జీవధార కాళేశ్వరంపై నిరాధారమైన కథలు ప్రచారం చేసి కేసీఆర్ గౌరవ ప్రతిష్టలను దెబ్బతీయాలనే కాంగ్రెస్ నాయకులు బరితెగించారు.
-నామా నాగేశ్వరరావు, ఖమ్మం మాజీ ఎంపీ