ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థులు పాల్వంచ పట్టణంలో తన పార్టీ కండువా మెడలో వేసుకొని వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్డుకున్న పోలీసు కానిస్టేబుల్‌పై దౌర్జన్యం.. ‘నువ్వెవరు?’ అంటూ బదాయింపు.. పాల్వంచలో కాంగ్రెస్ నేతల ప్రచారం.. అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలపై ఎదురుదాడి.. డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలపై కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య ఘర్షణ ఏదులాపురంలో ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం.. అడ్డుకున్న గులాబీ శ్రేణులతో వాగ్వాదం
లక్ష్మీదేవిపల్లి/ పాల్వంచ/ కొత్తగూడెం సింగరేణి/ ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 11 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అడుగడుగునా ఉల్లంఘించారు. ప్రశ్నించిన బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు దిగారు. అడ్డుకున్న పోలీసులపై దౌర్జన్యాలకు పాల్పడ్డారు. డబ్బుల పంపిణీ విషయంలో చివరికి సీపీఐ, కాంగ్రెస్ నేతలు పరస్పర వాగ్వాదాలకు దిగారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 55వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్దకు కాంగ్రెస్ అభ్యర్థి హరిహరన్ వచ్చాడు. మెడలో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లబోయాడు. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్.. అతడిని అడ్డుకున్నాడు. దీంతో సదరు కానిస్టేబుల్‌పై ఆ అభ్యర్థి దౌర్జన్యానికి దిగాడు. ‘కాంగ్రెస్ కండువా కప్పుకొని లోపలికి వెళ్లొద్దని చెప్పడానికి నువ్వెవరు? నేనిలాగే వస్తా’ అంటూ ఆ కానిస్టేబుల్ మీదికి వెళ్తూ దబాయించాడు.
పాల్వంచలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆయా పోలింగ్ బూత్‌ల వద్ద కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తుండడంతో టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేసేందుకు కూడా ప్రయత్నించారు. వీటిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో పోలీసులు వచ్చి ఈ రెండు పార్టీల నాయకులను చెదరగొట్టారు. పాత పాల్వంచలో బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య భారీ స్థాయిలో ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని అభియోగాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలంటూ ఎర్రగుంటలో ఓ పోలీసు కానిస్టేబుల్ ప్రచారం చేయడంతో అక్కడున్న బీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థులు గొడవకు దిగారు. పాల్వంచ పట్టణ ఎస్సైకి ఫిర్యాదు చేయడంతో ఆ కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి పంపించారు.
కొత్తగూడెం 19వ డివిజన్ చిట్టిరామవరం పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, సీపీఐ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలింగ్ సరళిని పరిశీలించుకునేందుకు సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా చిట్టిరామవరానికి వెళ్లారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి భర్త డాక్టర్ శంకర్‌నాయక్‌కు, సాబీర్పాషాకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. స్థానికేతరుడైన సాబీర్‌పాషా ఇక్కడికి వచ్చి ఓటర్లకు డబ్బులు పంచుతున్నాడని శంకర్‌నాయక్ ఆరోపించారు. సాబీర్‌పాషా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. డీఎస్పీ ఆదినారాయణ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
ఖమ్మం జిల్లా ఏదులాపురం 26వ వార్డులోని పోలింగ్ కేంద్రం ఎదుట బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని ఓటర్లు కాకుండా ఇతర మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు కొందరు ఓటర్లను కిటికీ దగ్గర నుంచి చూస్తూ వారిని ప్రలోభ పెడుతున్నాని బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ మద్దతుదారులు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు ఇరువర్గాలను చెదరగొట్టారు.