జూలూరుపాడు, డిసెంబర్ 19: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదన్న అక్కసుతో ఆ పార్టీ నాయకుడు ఓ రైతుకు పంట నష్టం కలిగించి రాక్షస ఆనందం పొందాడు. వివరాల్లోకెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గంగారంతండా గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గంగారంతండాకు చెందిన రైతు కొర్రా చిన్నరాములు తన రెండెకరాల్లో సాగు చేసిన వరి పంటను నూర్పిడి చేసి పంట పొలంలోనే కల్లం చేసి ధాన్యాన్ని ఆరబోశాడు. శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా ధాన్యం మొత్తం నీటిలో తేలియాడుతూ కనిపించింది.
దీంతో లబోదిబోమంటూ ఆ రైతు కుటుంబ సభ్యులు చుట్టుపక్కల రైతులను పిలిచి ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే ధాన్యం మొత్తం తడిసి రంగుమారడంతో గ్రామంలోని రహదారిపై పోసి గ్రామస్తులతో కలిసి ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నరాములు చేను పక్కన ఉన్న కాంగ్రెస్ నాయకుడు కొర్రా సామ్య మిర్చిపంటను సాగుచేస్తున్నాడు. గురువారం రాత్రి సామ్య తన మిర్చితోట నుంచి నీళ్లు పెట్టి పక్కనే ఉన్న వరిధాన్యం మొత్తం తడిసిపోయేలా చేశారు.
మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సామ్య బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని చిన్నరాములుని కోరాడు.. కానీ చిన్నరాములు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన వ్యక్తికి మద్దతు పలకడంతో అతనిపై సామ్య కోపం పెంచుకున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థి మూడు ఓట్లతో గెలిచినప్పటికీ కోపంతో ఉన్న సామ్య గురువారం రాత్రి తన మిర్చిపంట నుంచి వరి కల్లంలోకి నీళ్లు పెట్టి ధాన్యాన్ని తడిపి రాక్షస ఆనందం పొందాడు. చిన్నరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.