ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, తదితర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి నియోజకవర్గ స్థాయి నాయకులు, టికెట్ ఆశించి భంగపడిన నేతల చేరికల పరంపర కొనసాగుతోంది. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల సమక్షంలో చేరికల ప్రక్రియ ప్రవాహంలా సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో మూడు విడతలుగా సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతం కావడం.. ఇప్పటికే ప్రచారంలో టాప్ గేర్‌తో వెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు.. నేతల చేరిక ప్రచారంలో కలిసొచ్చే అంశమైంది. పది నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటనతోనే సతమతమైన కాంగ్రెస్.. బీఆర్ఎస్ ప్రచార హోరును చూసి బేజారవుతోంది. ఇన్నేళ్లు నమ్ముకున్నా పార్టీ టికెట్ ఇవ్వకుండా ‘చేతు’లెత్తేయడంతో గులాబీ పార్టీలోనే తమకు రాజకీయ మనుగడ ఉంటుందని భావించి కారెక్కుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చేరగా.. తాజాగా సత్తుపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కోడూరి సుధాకర్, ముల్కలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి, భద్రాద్రి జిల్లా సీపీఐ నేత రాంప్రసాద్ హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఖమ్మం, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కేడర్ ఖాళీ అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఆ పార్టీ అధిష్ఠానం వైఖరితో కాంగ్రెస్ పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు భటి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు వైఖరికి విసిగి వేసారి పది నియోజకవర్గాల పరిధిలోని పార్టీకి చెందిన ఎంతోమంది నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ‘గులాబీ’కి మద్దతునిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో పాటు అనేక మంది బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతుండడంతో ‘ఖమ్మం కాంగ్రెస్’కు కోలుకోలేని షాక్ తగిలింది. దీనిలో భాగంగా మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అనుచరుడు, ఓయూ విద్యార్థి జేఏసీ నేత మానవతారాయ్‌తో పాటు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కీలక నేత ఎడవెల్లి కృష్ణ, వైరా నియోజకవర్గం నుంచి కీలక నేత రాంచందర్‌నాయక్ శుక్రవారం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ చేరికల సంగతి మరువక ముందే సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క వర్గీయురాలు, ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి, కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు, సత్తుపల్లికి చెందిన నేత కోడూరి సుధాకర్ శనివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరి షాక్ ఇచ్చారు. వీరిలో సున్నం నాగమణి అశ్వారావుపేట నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డారు. అలాగే పంచాయతీశాఖలో డివిజనల్ ఇంజినీర్ కొలువుకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన కోడూరి సుధాకర్ సత్తుపల్లి నుంచి టికెట్ ఆశించి నిరాశ చెందారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించినా పార్టీ గుర్తించలేదని, బీఆర్ఎస్తోనే తమ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని గుర్తించి బీఆర్ఎస్లో చేరామని వారు ప్రకటించారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో తాతా మధు నేతృత్వంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, భద్రాచలం డివిజన్ సీనియర్ నాయకులు రావులపాటి రాంప్రసాద్, భద్రాచలం బీజేపీ టికెట్ ఆశించిన వెంకటాపురం ఎంపీపీ సతీశ్, సీపీఐ మండల కార్యదర్శి సునీల్, పలువురు సీపీఐ నాయకులు చేరారు. వరుస చేరికలతో ఉభయ జిల్లాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ మరింత డీలా పడినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే బీజేపీ నేత ఊకే అబ్బయ్య, టీడీపీ నేత జీవన్‌కుమార్ కూడా బీఆర్ఎస్లో చేరారు.
ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించకముందే బీఆర్ఎస్ అధిష్ఠానం ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అభ్యర్థులు అప్పటి నుంచి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పొద్దు లేచిన దగ్గర్నుంచి ప్రజల మధ్యే ఉంటున్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల ప్రచారంలోనూ వెనుకబడే ఉన్నది. సరైన మార్గదర్శకత్వం లేక కింది కేడర్ తలలు పట్టుకుంటున్నది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారికీ దిశానిర్దేశం చేస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఉభయ జిల్లాల పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, రేగా కాంతారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచిస్తున్నారు. వారిని ఎన్నికల ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు.