తెలంగాణ అధికారిక రాజముద్రలో కాకతీయుల కళాతోరణం, చార్మినార్ చిహ్నాలను తొలగించేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఉమ్మడి జిల్లా ప్రజలు, ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాచరిక ఆనవాళ్ల పేరిట వాటిని తులనాడడమంటే చరిత్రను ఛిద్రం చేయడమేనని స్పష్టం చేస్తున్నారు. అవి రాచరికపు ఆనవాళ్లు కావని.. తెలంగాణ సంస్కృతికి, చరిత్రకు, పౌరుషానికి ప్రతిబింబాలని తేల్చిచెబుతున్నారు. అవి మన అస్థిత్వాలని, భావోద్వేగంతో కూడిన ఆత్మగౌరవానికి ప్రతీకలని పేర్కొంటున్నారు. రాజకీయ కుట్రలను రాచరికపు ఆనవాళ్లకు జోడించడం ప్రస్తుత పాలకుల సంకుచితత్వానికి నిదర్శనమని చెబుతున్నారు.
ఇలాంటి కుట్రలు ముమ్మాటికీ తగవని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ చారిత్ర వైభవానికి విఘాతం కలిగించేలా ఎలాంటి మార్పులు చేసినా ఊరుకోబోమంటూ స్పష్టం చేస్తున్నారు. అలాగే, రాష్ట్ర గేయం ‘జయజయహే తెలంగాణ’లోనూ వాటి చరణాలను తొలగించే ప్రయత్నాన్ని తూర్పారబడుతున్నారు. కాకతీయుల ఆనవాళ్లను రాచరికపు కోణంలో చూస్తున్న ఈ ప్రభుత్వం.. వారి జనరంజక పాలనను, వారి గుర్తులుగా ఉన్న చెరువులను మర్చిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఉద్యమాలే ఊపిరిగా ఉండే తెలంగాణ సమాజం ఇలాంటి కుట్రలపైనా పోరాడుతుందని స్పష్టం చేస్తున్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనతో పోటీపడలేకపోతున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ అంటేనే చారిత్రాత్మక చార్మినార్ కట్టడం, కాకతీయ శిలాతోరణం. ఈ రెండు లేకుండా తెలంగాణ కొత్త లోగోని తయారు చేయడం అత్యంత దుర్మార్గం. టీఎస్‌ను టీజీగా మార్చినంత మాత్రాన రేవంత్‌రెడ్డి ఒరగబెట్టేదేమీ లేదు. తెలంగాణ సాధన కోసం ఏ రోజూ పోరాటం ఎరుగని రేవంత్‌రెడ్డి.. తెలంగాణ సాధన ఆకాంక్షలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తుండడం నీచం. తెలంగాణ మూలాలను, కీర్తిని మరిచి పాలన చేయడం దారుణం. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని భవిష్యత్ తరాలు మరిచిపోవాలని కుట్రతోనే ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర లోగో మార్చాలని చూస్తున్నారు.
-రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ మకుటాలైన కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్‌ను తొలగించడం సరికాదు. వందల ఏళ్ల కిందటి చరిత్రను తెలుసుకోకుండా వ్యక్తిగత కక్షతో చిహ్నాలను మార్చడం దుర్మార్గం. ప్రసుత్త ప్రభుత్వం చేసిన ఇలాంటి ఆలోచన తెలంగాణలోని ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. మన సంస్కృతిని, చరిత్రను రాజకీయ కోణంలో చూడటాన్ని ఎవరూ సహించరు. రాష్ట్ర చిహ్నంతోపాటు అధికారిక గీతాన్ని కూడా మార్చేందుకు యత్నించడం ముమ్మాటికీ సరికాదు. అయినప్పటికీ మార్చడమంటే తెలంగాణ ప్రజలను అవమానించడమే అవుతుంది. ఉద్యమసారథి కేసీఆర్ ఎంతో ఆలోచనలతో రూపొందించిన రాజముద్రలో మార్పుచేయాల్సిన అవసరం ఏముంది?
-పొడియం నరేందర్, తెలంగాణ ఉద్యమకారుడు, బూర్గంపహాడ్

‘జయ జయహే తెలంగాణ..’ గీతాన్ని తెలంగాణ ప్రజలు జాతీయగీతంగా ఆవాహనం చేసుకున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించడం హర్షించదగిన విషయమే. కానీ తెలంగాణలో సంగీత దర్శకులు లేనట్లు సంగీతాన్ని సమకూర్చే బాధ్యతను ఆంధ్ర దర్శకుడు ఎంఎం కీరవాణికి అప్పగించడం తెలంగాణ అస్థిత్వానికి భంగం కలిగించడమే. అంతేగాక సుభిక్ష పాలనకు వీరశౌర్యానికి ప్రతీకలైన కాకతీయ కళాతోరణాన్ని, హైదరాబాద్ అనగానే గుర్తుకు వచ్చే ప్లేగు వ్యాధి విముక్తికి వెలిసిన చిహ్నంగా ఉన్న చార్మినార్‌ను సంకుచితత్వంతో రాజముద్ర నుంచి తొలగించాలని చూడడం అవివేకం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితి ఉంటే అస్థిత్వం కోసం మరోమారు ఉద్యమించడానికి సన్నద్ధంగా ఉన్నాం.
– ములక సురేశ్, తెలంగాణ ఉద్యమకారుడు, ఖమ్మం
తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోని కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్‌ను తొలగించడమంటే.. శరీరం నుంచి గుండెను వేరుచేసినట్లే. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మార్చడం కూడా అలాంటిదే. తెలంగాణ సంస్కృతి, యాస, భాష, భావం.. అన్నీ కలగలిపిన గీతం ‘జయ జయహే తెలంగాణ’. అలాంటి గీతాన్ని మార్చడం తప్పు. పైగా దాన్ని ఆంధ్రా గాయకులతో పాడించి తెలంగాణ సాహితీవేత్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. చార్మినార్, కాకతీయ కళాతోరణం మన మూలాలు. అస్థిత్వాలు. కాకతీయుల కళాప్రభల కాంతిరేఖ రామప్ప. గోల్కొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్. అంత విడదీయరాని మన సంస్కృతిని ప్రభుత్వం వేరు చేసే ప్రయత్నం చేస్తున్నది. వీటిని తెలంగాణ ఉద్యమకారుడిగా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. తెలంగాణ ప్రజల మనోభావాలను, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయొద్దు.
– షేక్ అయూబ్ పాషా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు
రాజకీయ కుట్రలతో రాష్ట్ర చిహ్నాలను తొలగిస్తే ప్రజా ఉద్యమం తప్పదు. ప్రత్యేక రాష్ట్రం కోసం అప్పుడు ఎలా ఉద్యమించామో.. రాష్ట్ర చిహ్నం కోసం ఇప్పుడూ అదే విధంగా పోరాడుతాం. నాడు రాష్ట్ర చిహ్నాల కోసం అప్పటి సీఎం కేసీఆర్ ప్రతిపాదన చేసిన తరువాత కేంద్ర ప్రభుత్వం జీవో నెంబర్ 207 ద్వారా దానికి చట్టం చేసింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికార చిహ్నాలను అవమానిస్తోంది. అవి రాచరికపు గుర్తులంటూ ఆరోపిస్తోంది. అవి రాచరికపు గుర్తులు కాదు.. తెలంగాణ చరిత్రకు, సాంస్కృతిక వైభవ చిహ్నాలు. చార్మినార్ అంటే ఒక కట్టడం కాదు.. విశ్వనగర ఐకాన్. కాకతీయ కళాతోరణమంటే ఒక నిర్మాణం కాదు.. సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలతల్లికి నిలువెత్తు సంతకం. రామకృష్ణ, బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు.
ప్రభుత్వ చిహ్నంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్పుచేయాలని ఆలోచించడం దురదృష్టకరం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో పోటీపడలేక ప్రస్తుత ముఖ్యమంత్రి ఇలా ప్రభుత్వ చిహ్నాలు మార్పు చేయాలని ఆలోచిస్తున్నారు. ఉద్యమనేతపై అక్కసుతో, రాజకీయ కక్షతో ప్రభుత్వ చిహ్నాలను మార్చితే తెలంగాణ ప్రజలు క్షమించరు. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరగాల్సి వేళ.. ఇదే తెలంగాణ చరిత్రను ప్రసుత్త ముఖ్యమంత్రి అవమానిస్తున్నట్లుగా కన్పిస్తోంది.
-కోడి అమరేందర్, బీఆర్ఎస్ అశ్వాపురం మండల అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందిస్తున్న తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ చిత్రాన్ని ఏర్పాటు చేయాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌లోని చార్మినార్‌కు ఒక విశిష్టత ఉంది. ప్రభుత్వ చిత్రాన్ని రూపొందించడంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
– యాకూబ్‌పాషా, మైనార్టీల సంక్షేమ సంఘం భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు