నేలకొండపల్లి (కూసుమంచి), ఫిబ్రవరి 6: ‘మా కళ్లముందే యూరియా ఉంది. కానీ మాకు దొరకట్లేదు. మా ఊరి సొసైటీలో ఉన్న యూరియా బస్తాలను పొరుగు మండలాల రైతులొచ్చి తీసుకెళ్తున్నారు. యాప్లో బుక్ చేసుకోలేదన్న కారణంతో మాకు యూరియా బస్తాలను ఇవ్వడం లేదు. చిన్న ఫోన్లు (కీ ప్యాడ్ ఫోన్లు) ఎత్తడమే సరిగా తెలియని మాకు.. పెద్ద ఫోన్ల (స్మార్ట్ ఫోన్లు) గురించి ఎలా తెలుస్తుంది? వాటిల్లో యాప్లు పెట్టి వాటి ద్వారా బుక్ చేసుకుంటేనే ఎరువులు ఇస్తామంటే మేమేం చేయాలి?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామానికి చెందిన అన్నదాతలు. తమ గ్రామ సొసైటీకి వచ్చిన యూరియా బస్తాలను అధికారులు తమకు ఇవ్వడం లేదని, పొరుగు మండలాల రైతులు మొబైల్ యాప్ ద్వారా ముందుగానే బుక్ చేసుకున్నారన్న కారణంతో తొలుత వారికే ఇచ్చి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామానికి చెందిన కొడాలి అచ్చుతరావు, ఎర్రా చెలపతిరావు, రాయపాటి శ్రీను అనే రైతులతోపాటు ఇంకా చాలామంది రైతులు యూరియా బస్తాల కోసం వారం రోజులుగా అదే గ్రామంలోని సొసైటీ కార్యాలయం వద్దకు తిరుగుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఆ సొసైటీ కార్యాలయానికి యూరియా బస్తాల లోడు వచ్చింది. హమాలీలు ఆ యూరియా బస్తాలను దింపి గోడౌన్లో పెట్టారు. సొసైటీ అధికారులు ఆ యూరియా బస్తాల పంపిణీని ప్రారంభించారు. కానీ అదే గ్రామానికి చెందిన రైతులకు మాత్రం ఇవ్వడం లేదు. పొరుగు మండలాల రైతులకు ఇస్తుండడంతో వారు ఆటోలు కిరాయికి తెచ్చుకొని మరీ యూరియా బస్తాలను అందులో వేసుకొని వెళ్తున్నారు. ఇదేమిటని ఆ గ్రామ రైతులు అక్కడి అధికారులను అడిగారు.
‘ఆ రైతులు వారి మొబైల్ యాప్ నుంచి ముందుగానే యూరియా బస్తాలను బుక్ చేసుకున్నారు. అందుకని ముందుగా బుక్ చేసుకున్న వారికే ఇస్తున్నాం. బుక్ చేసుకోని వారికి ఇవ్వడం లేదు. మొబైల్ యాప్లో బుక్ చేసుకొని నంబరు తీసుకొని వస్తేనే ఇస్తాం. ఇలా కాకుండా నేరుగా రైతులు వస్తే ఇచ్చే పద్ధతిని ప్రభుత్వం తొలగించింది. ఏ రైతైనా తన స్మార్ట్ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని.. దానిలో తన పాస్బుక్, ఆధార్, మొబైల్ నంబర్ తదితర వివరాలు నమోదు చేసుకొని.. అదే యాప్ నుంచి స్టాక్ అందుబాటులో ఉన్న సొసైటీల్లో యూరియా కట్టలను బుక్ చేసుకొని రావాల్సిందే.’ అంటూ స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన అన్నదాతలు.. సొసైటీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపైనా, అది తీసుకొచ్చిన ఇలాంటి విధానాలపైనా దుమ్మెత్తిపోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్షరజ్ఞానం కూడా పెద్దగా లేని తాము స్మార్ట్ఫోన్లలో యాప్ ఇన్స్టాల్ చేసి దాని ద్వారా యూరియాను ఎలా బుక్ చేసుకోవాలంటూ ప్రశ్నించారు. మా గ్రామానికి చెందిన ఓ రైతుకు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లూరులో ఒక యూరియా బస్తా బుక్ అయితే రానూపోనూ సుమారు నాలుగు గంటలపాటు ప్రయాణించి ఆ రైతు దానిని ఎలా తెచ్చుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామ రైతులకు తమ గ్రామంలోనే యూరియా బస్తాలు ఇవ్వాలని, ఇలాంటి నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు.