అశ్వారావుపేట, నవంబర్ 12 : వరి కోతలు ప్రారంభమై సుమారు నెలరోజులు కావస్తున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేయలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు పేరుకుపోతున్నాయి. ప్రచార ఆర్భాటాలు తప్ప రైతులను ఆదుకుంటున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు కంటికి కనిపించడం లేదు. సరైన ప్రణాళిక లేకపోవడంతో ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది. ఏదేమైనా అధికారుల తీరు రైతులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 189 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నా తేమశాతం లేదనే సాకుతో ఇంకా ఎక్కడ కూడా ధాన్యం కొనుగోళ్లు చేపట్టనే లేదు. ఇప్పటికే అధిక వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడిన రైతులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 1,53,485 ఎకరాల్లో వరి సాగైంది. దీనిద్వారా సుమారు 2.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు అంచనా వేశారు. ఇందుకు 2.02 మెట్రిక్ టన్నులు సన్నాలు, 36 వేల టన్నుల దొడ్డు ధాన్యం ఉంటుంది. జిల్లాలో మొత్తం 189 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు.. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కువ కేంద్రాలు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ప్రారంభమైన కేంద్రాల పరిధిలోనూ ఒక్క ధాన్యపు గింజను అధికారులు కొనుగోలు చేయలేదు. దీనికి తేమశాతం రాలేదని చెబుతున్నారు. కొన్ని కేంద్రాల్లో రైతులు ఇప్పటికే ధాన్యం రాసులను నిల్వ చేశారు. గడిచిన వారంరోజులకు పైగానే సేకరణ కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబెట్టారు.
వర్షాలు తగ్గిపోయి కూడా సుమారు వారంరోజులు అవుతుందని, దీనిప్రకారం ధాన్యంలో తేమశాతం ఉంటుందని రైతులు చెబుతున్నారు. కొన్నికేంద్రాల నిర్వాహకులు కనీసం గన్నీ బ్యాగులు కావాలని ఇండెంట్ కూడా ఉన్నతాధికారులకు అందించలేదు. జిల్లాలో ధాన్యం సేకరణలో తీవ్ర తాత్సారం జరుగుతుందనటానికి అధికారుల వద్ద ధాన్యం సేకరణ లెక్క లేకపోవటం ఉదహరించవచ్చు. అయితే మిల్లుల నుంచి అనుమతి లేకపోవటంతోనే అధికారులు ధాన్యం కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. సర్కార్ తీరుతో విసుగు చెందుతున్న చిన్న, సన్నకారు రైతులు ఎక్కడ మళ్లీ వర్షాలు పడతాయోననే ఆందోళన చెందుతున్నారు. ధాన్యం రాసులను భద్రపరచలేక తక్కువ ధరలకే ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించుకుంటున్నారు. దీంతో రైతులు మద్దతు ధర లభించక ఆర్థికంగా నష్టపోతున్నారు.
జిల్లావ్యాప్తంగా 189 ధాన్యం కొనుగోలు కే్రందాలను ఇప్పటికే ప్రారంభించాము. తేమశాతం లేకనే ధాన్యం కొనుగోళ్లల్లో ఆలస్యమవుతోంది. మొత్తం 2.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అంచనా. ఇందులో సన్నాలు 2.02 లక్షలు, దొడ్డు రకం 36 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దు.. మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
– వరదరాజు, డీసీఎస్వో, భద్రాద్రి కొత్తగూడెం
అధికారులు ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రమే ఇంకా ప్రారంభించలేదు. ధాన్యం నిల్వ చేసి సుమారు వారంరోజులవుతోంది. 15వ తేదీ తర్వాత కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అధిక వర్షాలకు ఎంతో నష్టపోయి ఉన్నాం. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి రైతుల నుంచి ధాన్యం సేకరించాలి.
– చిన్నంశెట్టి రాంబాబు, రైతు, అశ్వారావుపేట
కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వ చేశాను. ఇప్పటివరకు అధికారులెవరూ రాలేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఎక్కువ మంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక భయపడుతున్నాం. ధాన్యం కొని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.
– తోట బంగారయ్య, రైతు, అశ్వారావుపేట