అశ్వారావుపేట, డిసెంబర్ 28 : ఈ ఏడాది యాసంగి సీజన్ మొదలై సుమారు నెలరోజులు గడుస్తున్నా రేవంత్‌రెడ్డి సర్కార్ రైతులకు పెట్టు బడి సాయం అందించలేదు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఇప్పటివరకు కనీసం భరోసా కూడా కల్పించలేదు. దీంతో యాసంగి పంటల పెట్టుబడి కోసం అన్నదాతలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అసలే వానకాలం సీజన్ కలిసిరాక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను కాంగ్రెస్ సర్కార్ తీరు మరింత కుంగదీస్తున్నది. ఈ ఏడాది సాంతం అన్నదాతలను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. పెట్టుబడి సాయం అసలు ఇస్తారా.. వరిసన్నాలకు బోనస్ ఎగ్గొట్టినట్లే ఈ సీజన్ ‘రైతుభరోసా’ కూడా ఎగ్గొడతారా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతులను ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు, ఇతర పనులకు పెట్టుబడి కోసం వెదుకులాడుతున్నారు. ‘రైతుభరోసా’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించే పంట సాయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రైతులు వానకాలం పంటలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. ఇప్పటికే నారు పెంపకం మొదలుపెట్టి దుక్కులు దున్నుతున్నారు. మరికొందరు రైతులు కూరగాయల సాగుకు సిద్ధమవుతున్నారు. రైతుభరోసా సాయం అందితే వ్యవసాయ సాగు పనులు ముమ్మరం చేసుకోవచ్చని రైతులు ఆశపడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మిన్నకుండిపోయింది. కనీసం పథకం అమలుపై కసరత్తు కనుచూపు మేర కనిపించడం లేదు. వరి సన్నాలకు బోనస్ ఎగ్గొట్టినట్లే పెట్టుబడి సాయానికి కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మంగళం పాడుతుందా అన్న సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. గత యాసంగి ధాన్యం బోనస్‌ను రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకూ చెల్లించలేదు. ఈ ఏడాది యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా సుమారు 1.25 లక్షల మంది రైతులు 1.60 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేపడుతున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా.
గత కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. సాగు విస్తీర్ణం పెంపు లక్ష్యంగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ‘రైతుబంధు’ పథకం అమలు చేసింది. ప్రతి వ్యవసాయ సీజన్లో ఎకరాకు రూ.5 వేలు చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించింది. మొదట ఎకరాకు రూ.4 వేలు అందించిన కేసీఆర్ ప్రభుత్వం పెరిగిన పంట పెట్టుబడులకు అనుగుణంగా రూ.5 వేలకు పెంచింది. కేసీఆర్ సర్కార్ సాయంతో రైతులు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పంటల సాగును సాఫీగా చేసుకున్నారు. ఇంతలో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు ప్రకటించింది. కానీ, అధికారంలోకి వచ్చాక పెట్టుబడి ఖర్చులు పెరిగినా ప్రభుత్వ సాయాన్ని రూ.12 వేలకే కుదించింది. ఈ లెక్కన ఏడాదికి రైతులకు రూ.3 వేలు చొప్పున ఎగనామం పెట్టింది. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేసి గెలిపించిన అన్నదాతలకు ఆశాభంగం కలిగింది.
యాసంగి సీజన్ మొదలై నెలరోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి రైతుభరోసా సాయంపై కదలిక లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా యాసంగి వ్యవసాయ పనులు నవంబర్ నుంచి ప్రారంభమవుతాయి. ఇప్పటికే నారు పెంపకం చేపట్టిన రైతులు సాగు పనులపై దృష్టి సారిస్తున్నారు. దుక్కులు దున్ని నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. చలి కారణంగా నారు పెంపకం ఆలస్యంకావడంతో వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతున్నాయి. సుమారు నెలరోజులపాటు పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రైతులు కూడా ఆ దిశగా ఆలోచన చేయలేదు. కానీ, కోడ్ ముగిసి వారం రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేదు. భూముల క్రయవిక్రయాలు, కొత్త పాసు పుస్తకాలు అందుకున్న రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు అయిన తర్వాత రైతు భరోసా నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం సాగు ఇబ్బందులను దృష్టిలో వెంటనే పెట్టుబడి సాయం అందించాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
యాసంగి సీజన్ ప్రారంభమై నెల రోజులు అవుతున్నది. వ్యవసాయ పనులు మొదలు పెట్టడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము. ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద పెట్టుబడి సాయం ఇస్తే కొంత ఉపశమనం ఉంటుంది. కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం రైతుభరోసా మంజూరుపై స్పందించడం లేదు. పథకం అమలుపై గందరగోళం నెలకొంది.
– పలగాని పుల్లారావు, రైతు, అన్నపురెడ్డిపల్లి
వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులకు వడ్డీ వ్యాపారులే దిక్కు అవుతున్నారు. పెట్టుబడి కోసం అప్పు చేయాల్సి వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీంతో అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెట్టాల్సి వస్తున్నది. ‘రైతుభరోసా’ సకాలంలో అందకపోవడంతో పెట్టుబడి కోసం అప్పులు చేయక తప్పడం లేదు.
– బండి కోటిరెడ్డి, రైతు, దమ్మపేట
రైతులకు పంటల పెట్టుబడి కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుభరోసా సాయం వారికి ఆర్థిక భరోసాగా ఉంటుంది. అయితే సకాలంలో పెట్టుబడి సాయం అందకపోతే వడ్డీ వ్యాపారుల వద్ద రైతులు అప్పు చేస్తున్నారు. దీంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం స్పందించి తక్షణమే యాసంగి పెట్టుబడి సాయం అందించాలి.
– నల్లమోతు వెంకటనారాయణ, గుంపెన సొసైటీ మాజీ వైస్ చైర్మన్, చండ్రుగొండ
రైతుభరోసా నిధులు మంజూరు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్ష సాధిస్తున్నట్లు కనిపిస్తున్నది. వ్యవసాయ పనులు మొదలు పెట్టుకోవడానికి ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులకు ఆర్థిక వెసులుబాటును కలిగిస్తున్నది.. కానీ, ఏదోక సాకుతో ప్రభుత్వం సాయం అందించకుండా జాప్యం చేస్తున్నది. దశలవారీగా అసలు పథకాన్నే నిర్వీర్వం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు అర్థమవుతున్నది.
– మడివి దుర్గారావు, రైతు, అశ్వారావుపేట